శిఖర్‌ ధవన్‌ మెరుపులు | Dubai Royals beat Pune Panthers by 8 wickets to win the inaugural edition of World Legends Pro T20 League | Sakshi
Sakshi News home page

శిఖర్‌ ధవన్‌ మెరుపులు

Feb 5 2026 7:54 AM | Updated on Feb 5 2026 8:39 AM

Dubai Royals beat Pune Panthers by 8 wickets to win the inaugural edition of World Legends Pro T20 League

వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌ టైటిల్‌ను దుబాయ్‌ రాయల్స్‌ ఎగరేసుకుపోయింది. గోవా వేదికగా నిన్న (ఫ్రిబవరి 5) జరిగిన ఫైనల్లో పూణే పాంథర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఛాంపియన్‌గా అవతరించింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పూణే ఫాంథర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. పాంథర్స్‌ ఇన్నింగ్స్‌లో ఉపుల్‌ తరంగ (55), మార్టిన్‌ గప్తిల్‌ (62), షేన్‌ వాట్సన్‌ (50 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. 

మిగతా ఆటగాళ్లలో కెప్టెన్‌ కీరన్‌ పోలార్డ్‌ 1, రాబిన్‌ ఉతప్ప 15, సమీవుల్లా షిన్వారి (4 నాటౌట్‌) పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో పియుశ్‌ చావ్లా 2, క్రిస్‌ మోఫు, పర్వేజ్‌ రసూల్‌ తలో వికెట్‌ తీశారు.

అనంతరం బరిలోకి దిగిన రాయల్స్‌ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు మన్విందర్‌ బిస్లా (67), శిఖర్‌ ధవన్‌ (64) మెరుపు అర్ద సెంచరీలు చేసి రాయల్స్‌ గెలుపును ఖరారు చేశారు. 

మిగతా పనిని సమిత్‌ పటేల్‌ (2 నాటౌట్‌), అంబటి రాయుడు (29 నాటౌట్‌) పూర్తి చేశారు. పాంథర్స్‌ బౌలర్లలో అంకిత్‌ రాజ్‌పుత్‌, డ్వేన్‌ బ్రావోకు తలో వికెట్‌ దక్కింది. రాయల్స్‌ గెలుపుతో కీలకపాత్ర పోషించిన శిఖర్‌ ధవన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది.

కాగా, వరల్డ్‌ లెజెండ్స్‌ ప్రో టీ20 లీగ్ ఈ ఎడిషన్‌తోనే అరంగేట్రం చేసింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్‌, దుబాయ్‌ రాయల్స్‌, గుర్‌గ్రామ్‌ థండర్స్‌, మహారాష్ట్ర టైకూన్స్‌, పూణే పాంథర్స్‌, రాజస్థాన్‌ లయన్స్‌) పాల్గొన్నాయి.

గోవా వేదికగా జనవరి 26న మొదలైన ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరిగాయి. ఈ లీగ్‌లో హర్భజన్‌ సింగ్‌, శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, షేన్‌ వాట్సన్‌, డేల్‌ స్టెయిన్‌, ఇయాన్‌ మోర్గాన్‌, మార్టిన్‌ గప్తిల్‌, కీరన్‌ పోలార్డ్‌ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొన్నారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement