ఇషా సింగ్‌కు రెండు స్వర్ణ పతకాలు | Isha Singh won two gold medals | Sakshi
Sakshi News home page

ఇషా సింగ్‌కు రెండు స్వర్ణ పతకాలు

Feb 5 2026 3:47 AM | Updated on Feb 5 2026 3:47 AM

Isha Singh won two gold medals

ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌ప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ రెండు స్వర్ణ పతకాలతో మెరిసింది. న్యూఢిల్లీలో బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో 21 ఏళ్ల ఇషా మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన వ్యక్తిగత ఫైనల్లో ఇషా సింగ్‌ 239.8 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 

భారత్‌కే చెందిన సురుచి సింగ్‌ 197.7 పాయింట్లతో నాలుగో స్థానంలో, మను భాకర్‌ 135.3 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచారు. టీమ్‌ విభాగంలో ఇషా, సురుచి, మను భాకర్‌లతో కూడిన భారత బృందం 1726 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు కాంస్యం, రజతం లభించాయి. వ్యక్తిగత విభాగంలో సామ్రాట్‌ రాణా 220.3 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలిచాడు.

టీమ్‌ విభాగంలో సామ్రాట్‌ రాణా, శ్రవణ్‌ కుమార్, వరుణ్‌ తోమర్‌లతో కూడిన భారత బృందం 1732 పాయింట్లతో రజతం దక్కించుకుంది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో గావిన్‌ ఆంటోనీ స్వర్ణం నెగ్గాడు. టీమ్‌ విభాగంలో గావిన్‌ ఆంటోనీ, చిరాగ్‌ శర్మ, ముకేశ్‌ నేలవల్లి (ఆంధ్రప్రదేశ్‌)లతో కూడిన భారత బృందం 1735 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.    

Advertisement
 
Advertisement
Advertisement