టీమిండియా మాజీ క్రికెటర్, నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారా అంతర్జాతీయ కెరీర్ ముగిసాక తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు. సహజంగా నిదానంగా ఆడే అతను.. శైలికి భిన్నంగా వేగంగా పరుగులు సాధించాడు. వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ ఇనాగురల్ ఎడిషన్‌లో గుర్‌గ్రామ్ థండర్స్‌కు ఆడుతున్న పుజారా.. నిన్న (జనవరి 28) దుబాయ్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తనలోని విధ్వంసకర యాంగిల్‌ను అభిమానులకు పరిచయం చేశాడు.
201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఉగ్రరూపాన్ని ప్రదర్శించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి 14 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అయితే దురదృష్టవశాత్తు 99 పరుగుల వద్ద (60 బంతుల్లో) మరో భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. మరో దురదృష్టమేమిటంటే.. పుజారా శైలికి భిన్నంగా చెలరేగినా, ఈ మ్యాచ్‌లో తన జట్టు గెలవలేకపోయింది.
అతనితో పాటు కెప్టెన్ తిసారా పెరీరా (56 నాటౌట్) కూడా బ్యాట్ ఝులిపించినా థండర్స్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పియూశ్ చావ్లా (4-0-35-3) వికట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి థండర్స్‌ను దెబ్బకొట్టాడు. అంతకుముందు అంబటి రాయుడు (45), సమిత్ పటేల్ (65 నాటౌట్) రాణించడంతో దుబాయ్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
కాగా, వరల్డ్ లెజెండ్స్ ప్రో టీ20 లీగ్ గోవా వేదికగా జనవరి 26న మొదలైంది. ఈ లీగ్‌లో ఇదే తొలి ఎడిషన్. ఇందులో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్‌గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్స్, పూణే పాంథర్స్, రాజస్థాన్ లయన్స్) పాల్గొంటున్నాయి.
పది రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో మొత్తం 18 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, డేల్ స్టెయిన్ తదితర 90 మంది దిగ్గజాలు పాల్గొంటున్నారు.


