ఆంటోనెల్లి అదరహో | Italian driver wins first race of his career | Sakshi
Sakshi News home page

ఆంటోనెల్లి అదరహో

Mar 16 2026 3:28 AM | Updated on Mar 16 2026 3:28 AM

Italian driver wins first race of his career

చైనా గ్రాండ్‌ప్రి టైటిల్‌ కైవసం

కెరీర్‌లో తొలి రేసు నెగ్గిన ఇటాలియన్‌ డ్రైవర్‌

రెండో పిన్న వయస్కుడిగా రికార్డు

రసెల్‌కు రెండో స్థానం

మార్చి 29న జపాన్‌ గ్రాండ్‌ప్రి

షాంఘై: ఈ ఏడాది ఫార్మాలావన్‌ (ఎఫ్‌1)లో మెర్సిడెస్‌ డ్రైవర్ల జోరు సాగుతోంది. సీజన్‌ ఆరంభ రేసు ఆ్రస్టేలియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌ డ్రైవర్‌ జార్జ్‌ రసెల్‌ విజేతగా నిలవగా... తాజాగా రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో అదే జట్టుకు చెందిన కిమీ ఆంటోనెల్లి అగ్రస్థానం దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్‌ రేసులో మెరుపు వేగంతో దూసుకెళ్లి... గ్రాండ్‌ప్రి రేసుల్లో ‘పోల్‌ పొజిషన్‌’ సాధించిన అతిపిన్న వయసు్కడిగా రికార్డు సృష్టించిన ఈ 19 ఏళ్ల డ్రైవర్‌... ఆదివారం ప్రధాన రేసులో సైతం అదే దూకుడు కొనసాగించాడు. 

56 ల్యాప్‌ల ఈ రేసును ఆంటోనెల్లి అందరికంటే వేగంగా అందరికంటే ముందుగా 1 గంటా 33 నిమిషాల 15.607 సెకన్లలో లక్ష్యాన్ని చేరి కెరీర్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ ఇటలీ డ్రైవర్‌... ఫార్ములావన్‌ చరిత్రలో ఒక రేసులో విజయం సాధించిన రెండో అతిపిన్న వయసు్కడిగా నిలిచాడు. 2016లో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ 18 ఏళ్ల వయసులోనే రేసు నెగ్గాడు. 

జార్జ్‌ రసెల్‌ 1 గంట 33 నిమిషాల 21.122 సెకన్లతో రెండో స్థానం దక్కించుకోగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్, ఫెరారీ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 33 నిమిషాల 40.874 సెకన్లు) మూడో స్థానంతో పోడియంపై చోటు దక్కించుకున్నాడు. 2024 తర్వాత ఫెరారీ డ్రైవర్‌ పోడియంపై నిలవడం ఇదే తొలిసారి. పదకొండేళ్ల ప్రాయం నుంచి రేసింగ్‌ చేస్తున్న ఆంటోనెల్లి... గతేడాదే మెర్సిడెస్‌ జట్టుతో చేరాడు. 

2025 సీజన్‌లో దిగ్గజ డ్రైవర్‌ హామిల్టన్‌ మెర్సిడెస్‌ను వీడి ఫెరారీతో జట్టు కట్టడంతో అతడి స్థానాన్ని ఆంటోనెల్లి భర్తీ చేశాడు. ఇప్పుడు అతడినే వెనక్కి నెడుతూ అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. చార్‌లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 33 నిమిషాల 44.501 సెకన్లు; ఫెరారీ), ఒలీవర్‌ బియర్మన్‌ (1 గంట 34 నిమిషాల 12.875 సెకన్లు; హాస్‌) వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లోనిలిచారు. 

నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రేసును పూర్తి చేయలేకపోగా... గతేడాది వరుస విజయాలతో హోరెత్తించిన మెక్‌లారెన్‌ డ్రైవర్లు లాండో నోరిస్, ఆస్కార్‌ పియాస్ట్రి సాంకేతిక కారణాలతో అసలు రేసులోనే పాల్గొనలేదు. మొత్తం 22 మంది డ్రైవర్లలో ఏడుగురు రేసును పూర్తి చేయలేకపోయారు.

బహ్రెయిన్, సౌదీ అరేబియా రేసులు రద్దు 
పశి్చమాసియాలో యుద్ధం కొనసాగుతుండటంతో... ఈ సీజన్‌లో నాలుగో రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి (ఏప్రిల్‌ 12న), ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి (ఏప్రిల్‌ 19న)లను రద్దు చేస్తున్నట్లు ఫార్ములావన్‌ పాలక మండలి ఆదివారం ప్రకటించింది. పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో... ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘ప్రస్తుతానికి ఆ రెండు రేసులను నిలిపివేస్తున్నాం. భద్రతే అన్నిటికన్నా ముఖ్యం. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఏప్రిల్‌ వరకు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement