తన్జిద్ హసన్ సెంచరీ
చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్ పరాజయం
సల్మాన్ ఆగా శతకం వృథా
ఢాకా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన బంగ్లాదేశ్ జట్టు 2–1తో పాకిస్తాన్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఆఖరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో నెగ్గింది. నిర్ణయాత్మక పోరులో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ చేజిక్కించుకుంది.
కీలక మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్జిద్ హసన్ (107 బంతుల్లో 107; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... తౌహిద్ హృదయ్ (48 నాటౌట్; 4 ఫోర్లు), లిటన్ దాస్ (41; 1 ఫోర్, 1 సిక్స్), సైఫ్ హసన్ (36; 3 ఫోర్లు) అతడికి సహకరించారు.
పాకిస్తాన్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 3 వికెట్లు పడగొట్టగా... షాహీన్ షా అఫ్రిది, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 50 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సల్మాన్ ఆగా (98 బంతుల్లో 106; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో పోరాడగా... అబ్దుల్ సమద్ (34; 5 ఫోర్లు), సాద్ మసూద్ (38; 5 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. సాహిబ్‌జాదా ఫర్హాన్ (6), మాజ్ (6), రిజ్వాన్ (4) విఫలమయ్యారు.
పాకిస్తాన్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరమైన దశలో రెండు సిక్స్‌లు కొట్టిన కెప్టెన్ షాహీన్ అఫ్రిది (38 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆశలు రేపినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4 వికెట్లు పడగొట్టగా... ముస్తఫిజుర్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ ప్లేయర్లు ఘాజి ఘోరి, సాద్ మసూద్ అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశారు.


