భారత్‌ ధనాధన్‌ ‘షో’ | IND vs NZ 5th T20: Team India victory against New Zealand | Sakshi
Sakshi News home page

IND vs NZ 5th T20: భారత్‌ ధనాధన్‌ ‘షో’

Jan 31 2026 10:29 PM | Updated on Feb 1 2026 3:43 AM

IND vs NZ 5th T20: Team India victory against New Zealand

ఇషాన్‌ కిషన్‌ 43 బంతుల్లో 10 సిక్స్‌లు, 6 ఫోర్లతో 103 

కివీస్‌పై ఆఖరి టి20లో 46 పరుగులతో విజయం 

చెలరేగిన సూర్య, పాండ్యా  

తిరువనంతపురం: పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారత్‌ పెద్ద పండగే చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగింది. శనివారం జరిగిన ఐదో టి20లో టీమిండియా 46 పరుగులతో కివీస్‌ను ఓడించింది. 4–1 ఆధిక్యంతో సిరీస్‌ను ముగించింది. మొదట భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. టి20ల్లో భారత్‌కిది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇషాన్‌ కిషన్‌ (43 బంతుల్లో 103; 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ (30 బంతుల్లో 63; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 42; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా సిక్సర్ల మోత మోగించారు. అనంతరం న్యూజిలాండ్‌ 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది. అలెన్‌ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 6 సిక్స్‌) మినహా అంతా విఫలమయ్యారు. అర్ష్ దీప్ కు 5 వికెట్లు దక్కాయి.  

మెరుపు భాగస్వామ్యం... 
అభిషేక్‌ శర్మ (16 బంతుల్లో 30; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సిక్స్‌తో ఖాతా తెరిచిన భారత్‌ తొలి ఓవర్లో మరో 2 ఫోర్లతో 14 పరుగులు సాధించింది. రెండో ఓవర్లోనూ 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 15 పరుగులు పిండుకుంది. సొంత మైదానంలోనూ సామ్సన్‌ (6) మరో అవకాశాన్ని వృథా చేసుకొని నిరాశపర్చాడు. పవర్‌ప్లేలో భారత్‌ స్కోరు 54/2. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌ దంచేయడంతో మైదానం హోరెత్తింది. 

సాంట్నర్‌ పదో ఓవర్లో సూర్య ఓ సిక్స్‌ కొడితే స్ట్రయిక్‌ అందుకున్న కిషన్‌ 4, 6 కొట్టాడు. దీంతో ఈ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. జట్టు స్కోరు కూడా వంద దాటింది.  ఓ వైపు నుంచి ఇషాన్, మరోవైపు నుంచి కెప్టెన్ సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్లను నిర్దయగా బాదేశారు. 28 బంతుల్లో ఇషాన్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇష్‌ సోధి వేసిన 12వ ఓవరైతే ప్రతి బంతి లైన్‌ అవతలే! 

మొదటి బంతి వైడ్‌ అయి ఊపిరి పీల్చుకుంటే తర్వాతి బంతుల్ని కిషన్‌ 4, 4, 4, 6, 4, 6లుగా బాదేశాడు. ఈ ఒక్క ఓవర్లోనే 29 పరుగులొచ్చాయి. బౌలర్లు ఎంతమంది మారినా... కిషన్‌ ధాటి మారనేలేదు. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాక సూర్య నిష్క్రమించాడు. 

హార్దిక్‌ పాండ్యా కూడా దూకుడుగా ఆడటంతో 16వ ఓవర్లోనే భారత్‌ 200 మార్క్‌ చేరుకుంది. సాంట్నర్‌ 17వ ఓవర్లో పాండ్యా 6, 2, 4, 1 ధాటిని ప్రదర్శిస్తే మిగిలిన 2 బంతుల్ని సిక్స్‌లు బాదిన కిషన్‌ 42 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఫెర్గూసన్‌ వేసిన మూడో ఓవర్లో (2 పరుగులు, 1 వికెట్‌), సాంట్నర్‌ వేసిన 8వ ఓవర్లో మాత్రమే (5 పరుగులు) భారత్‌ బౌండరీ రాబట్టలేకపోయింది.   

అలెన్‌ అర్ధ సెంచరీ... 
ఆరంభంలోనే సీఫర్ట్‌ (5) అవుటైనా... అలెన్, రచిన్‌ రవీంద్ర (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌) న్యూజిలాండ్‌ స్కోరును పరుగెత్తించారు. రెండో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించాక అలెన్‌ దూకుడుకు అక్షర్‌ అడ్డుకట్ట వేశాడు. తర్వాత అర్‌‡్షదీప్, అక్షర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 20 పరుగుల వ్యవధిలో ఫిలిప్స్‌ (7), రచిన్, సాంట్నర్‌ (0) వికెట్లను కోల్పోవడంతో కివీస్‌ పనైపోయింది. మిచెల్‌ (26), ఆఖర్లో ఇష్‌ సోధి (15 బంతుల్లో 33; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్‌ 200 పైచిలుకు పరుగులు దాటగలిగింది.

తిలక్‌ వర్మ రెడీ... 
టి20 ప్రపంచకప్‌నకు ముందు భారత జట్టుకు శుభవార్త. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. గాయం కారణంగా న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరమైన తిలక్‌... బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. అతడు మంగళవారం ముంబైలో టీమిండియాతో కలవనున్నాడు. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆకట్టుకోలేకపోయిన సంజు సామ్సన్‌ స్థానంలో టి20 ప్రపంచకప్‌లో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయం కాగా... తిలక్‌ వర్మ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు.  

3 టి20ల్లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరు. గతంలో 297/6 (బంగ్లాదేశ్‌పై), 283/1 (దక్షిణాఫ్రికాపై) సాధించింది.

3 రోహిత్, కోహ్లి తర్వాత అంతర్జాతీయ టి20ల్లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆటగాడిగా సూర్యకుమార్‌ (3030) నిలిచాడు. ఓవరాల్‌గా ఈ మైలురాయిని దాటిన 12 మందిలో అతి తక్కువ బంతుల్లో (1822) సూర్య ఈ ఘనతను అందుకోవడం విశేషం.

1 అర్ష్ దీప్  కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన (5/51) నమోదు చేశాడు.

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) ఫెర్గూసన్‌ 30; సామ్సన్‌ (సి) జాకబ్స్‌ (బి) ఫెర్గూసన్‌ 6; ఇషాన్‌ కిషన్‌ (సి) ఫిలిప్స్‌ (బి) డఫీ 103; సూర్యకుమార్‌ (స్టంప్డ్‌) సీఫర్ట్‌ (బి) సాంట్నర్‌ 63; పాండ్యా (సి) జాకబ్స్‌ (బి) జేమీసన్‌ 42; రింకూ నాటౌట్‌ 8; దూబే నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 271. వికెట్ల పతనం: 1–31, 2–48, 3–185, 4–233, 5–261. బౌలింగ్‌: డఫీ 4–0–53–1, జేమీసన్‌ 4–0–59–1, ఫెర్గూసన్‌ 4–0–41–2, ఇష్‌ సోధి 3–0–48–0, ఫిలిప్స్‌ 1–0–10–0, సాంట్నర్‌ 4–0–60–1. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: సీఫర్ట్‌ (సి) పాండ్యా (బి) అర్ష్ దీప్  5; అలెన్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 80; రచిన్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్ దీప్  30; ఫిలిప్స్‌ (సి) రింకూ (బి) అక్షర్‌ 7; మిచెల్‌ (బి) అర్ష్ దీప్  26; సాంట్నర్‌ (సి) సూర్య (బి) అర్ష్ దీప్  0; జాకబ్స్‌ (బి) వరుణ్‌ 7; జేమీసన్‌ (బి) అర్ష్ దీప్  9; ఇష్‌ సోధి (సి) అర్ష్ దీప్  (బి) రింకూ 33; ఫెర్గూసన్‌ (బి) అక్షర్‌ 3; డఫీ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 225 వికెట్ల పతనం: 1–17, 2–117, 3–131, 4–137, 5–137, 6–166, 7–179, 8–180, 9–191, 10–225. బౌలింగ్‌: అర్ష్ దీప్  4–0–51–5, పాండ్యా 2–0–15–0, బుమ్రా 4–0–58–0, వరుణ్‌ 4–0–36–1, అక్షర్‌ 4–0–33–3, అభిషేక్‌ 1–0–13–0, రింకూ సింగ్‌ 0.4–0–7–1.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement