నేడు భారత్, న్యూజిలాండ్ ఐదో టి20
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
తిరువనంతపురం: టి20 ప్రపంచ కప్‌కు ముందు ఆడుతున్న ఆఖరి సిరీస్‌లో భారత్ ఇప్పటికే తమ అస్త్రశ్రస్తాలు అన్నింటినీ పరీక్షించుకుంది. న్యూజిలాండ్‌పై తొలి మూడు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన జట్టు 3–0తో సిరీస్‌ను గెలుచుకుంది. విశాఖపట్నంలో జరిగిన గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడినా...ఆందోళన చెందాల్సిన పరిస్థితేమీ లేదు. అయితే మెగా పోరుకు ముందు మిగిలిన ఒక మ్యాచ్‌లో మళ్లీ చెలరేగాలని జట్టు పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో నేడు గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన ఐదో టి20కి రంగం సిద్ధమైంది. మరోవైపు సిరీస్ కోల్పోయిన తర్వాత గత మ్యాచ్‌లో రాణించిన క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకున్న కివీస్ కూడా విజయంతో ముగించాలని భావిస్తోంది. భారత్‌లోనే జరిగే వరల్డ్ కప్‌కు ముందు ఈ గెలుపు ఆ టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఖాయం.
సిరీస్‌లో జట్టు ప్రదర్శనను బట్టి చూస్తే ఒక్క సంజు సామ్సన్ ఫామ్ విషయంలోనే మేనేజ్‌మెంట్ కొంత ఇబ్బంది పడుతోంది. తన సొంత మైదానంలో అశేష అభిమానుల మధ్య బరిలోకి దిగనున్న సామ్సన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడేందుకు ఇంతకంటే సరైన వేదిక, సమయం ఉండదు. తొలి టి20 ఆడుతూ గాయంతో తప్పుకున్న అక్షర్ పటేల్ తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతను పూర్తిగా కోలుకుంటే ఆడతాడు. స్వల్ప గాయంతో వైజాగ్ మ్యాచ్ ఆడని ఇషాన్ కిషన్ కూడా ఫిట్‌గా ఉంటే మళ్లీ తుది జట్టులోకి రావచ్చు.
మరోవైపు కివీస్ కూడా ఒక మార్పుతో ఆడే అవకాశం ఉంది. ఓపెనర్, వికెట్ కీపర్ ఫిన్ అలెన్ అందుబాటులో రావడంతో సీఫెర్ట్‌ను విశ్రాంతినిచ్చి అతడిని ఆడించే అవకాశం ఉంది. తిరువనంతపురంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. కాబట్టి భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ఇక్కడా మంచు ప్రభావం ఉంది. గతంలో ఈ మైదానంలో 4 టి20లు ఆడిన భారత్ 3 గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో ఆ్రస్టేలియాతో జరిగిన పోరులో భారత్ 235 పరుగులు నమోదు చేసింది.


