
తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు ఏకంగా మూడు సార్లు ఎదురెదురుపడ్డాయి. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్లో.. తలపడిన ప్రతిసారి భారత్ పాక్‌ను చిత్తుగా ఓడించి, తొమ్మిదో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది. ఈ ఆసియా కప్ టోర్నీలో మునుపెన్నడూ చోటు చేసుకొని హైడ్రామా చోటు చేసుకుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్‌కు నిరాకరించారు. టీమిండియాను ఏమీ చేసుకోలేక పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేసి శునకానందం పొందింది. ఐసీసీ తిరిగి వారికే అక్షింతలు వేయడంతో తోకముడిచి భారత ఆటగాళ్లను, భారతీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
సూపర్-4 దశ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు హరీస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్ భారత ఆటగాళ్లను సంజ్ఞలతో కవ్వించే ప్రయత్నం చేశారు. టీమిండియా మాత్రం ఈసారి కూడడా ఆటతీరుతోనే వారికి బుద్ది చెప్పింది.
ఫైనల్లో భారత్ పాక్‌ను ముచ్చటగా మూడోసారి ఓడించిన తర్వాత డ్రామా మరింత రక్తి కట్టింది. టైటిల్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకునేందుకు నిరాకరించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత క్రికెటర్లు ఆసియా కప్ వేదికగా పాక్ ఆటగాళ్లకు చేయాల్సిన మర్యాదంతా చేశారు.
పాకిస్తాన్‌ను క్రికెట్ మైదానంలో మరో దెబ్బ కొట్టేందుకు టీమిండియాకు అతి త్వరలో మరో అవకాశం రానుంది. ఐసీసీ మహిళల క్రికెట్ వరల్డ్‌కప్-2025లో (ICC Women's World Cup 2025) భారత్ అక్టోబర్ 5న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈసారి కూడా టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించాలని యావత్ భారతావణి కోరుకుంటుంది.
ఈ మ్యాచ్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. ఈ మెగా టోర్నీకి శ్రీలంకతో పాటు భారత్ కూడా ఆతిథ్యమిస్తున్నా.. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాక్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో నిర్వహిస్తున్నారు. మొత్తానికి మరో 5 రోజుల్లో పాక్‌కు బుద్ది చెప్పే అవకాశం భారత్‌కు మరోసారి రానుంది.
కాగా, మహిళల వన్డే వరల్డ్‌కప్ రేపటి నుంచే (సెప్టెంబర్ 30) ప్రారంభం కానుంది. గౌహతి వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమవుతుంది.