2025 ఏడాది.. టీమిండియాకు మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముఖ్యంగా టెస్టుల్లో అయితే భారత్ ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను సమం చేసింది. అనంతరం స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినప్పటికి.. సౌతాఫ్రికాపై ఘోర పరాభావాన్ని మూట కట్టుకుంది.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో గిల్ సేన వైట్ వాష్‌కు గురైంది. దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆశలను భారత్ సంక్లిష్టం చేసుకుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన మ్యాచ్‌లన్నింటిలోనూ తప్పనిసారిగా గెలవాలి. ఈ నేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఉతప్ప అభిఫ్రాయపడ్డాడు. పాండ్యా ప్రస్తుతం కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2017లో శ్రీలంకపై టెస్టు అరంగేట్రం చేసిన పాండ్యా.. ఇప్పటివరకు కేవలం 11 టెస్టులు మాత్రమే ఆడాడు. చివరసారిగా పాండ్యా టెస్టుల్లో 2018లో ఇంగ్లండ్‌పై ఆడాడు. వెన్ను గాయం కారణంగా అతడు టెస్టు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 11 టెస్టుల్లో 532 పరుగులతో పాటు 17 వికెట్లు పడగొట్టాడు.
"హార్దిక్ పాండ్యాను తిరిగి వైట్ బాల్ జెర్సీలో చూడాలనుకుంటున్నాను. పాండ్యా టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తే.. అతడికి ఏడో స్ధానం సరిగ్గా సరిపోతుంది. భారత్ లోయార్డర్ బ్యాటింగ్ కష్టాలు తీరిపోతాడు. అతడొక అద్భుతమైన ఆటగాడు. ఒకవేళ పాండ్యా టెస్టుల్లో తిరిగి ఆడేందుకు సముఖత చూపిస్తే.. సెలక్టర్లు గానీ, బోర్డు పెద్దలు గానీ నో చెప్పరు.
ఎందుకంటే అతడు సూపర్ ఫామ్‌తో పాటు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 12 నుండి 15 ఓవర్ల వరకు సులభంగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుతం జట్టులోని మిగితా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఎవరూ కూడా 20 ఓవర్లకు మించి బౌల్ చేయడం లేదు కాదు. నితీశ్ కుమార్ రెడ్డి కేవలం 12 ఓవర్ల లోపే బౌలింగ్ చేస్తున్నాడు.
హార్దిక్ అంతకుమించి ఒకట్రెండు ఓవర్లు ఎక్కువగా బౌలింగ్ చేయగలడు. అతడు రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. కానీ ఇది పూర్తిగా అతడి వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని" తన యూట్యూబ్ ఛానల్‌లో ఉతప్ప పేర్కొన్నాడు.
చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!


