విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా సోమవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో ఒడిశా జట్టు చేతిలో ఓటమి పాలైంది.
ఆలూర్ వేదికగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 49.2 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. కోన శ్రీకర్ భరత్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు), షేక్ రషీద్ (35 బంతుల్లో 20; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుంటున్న దశలో అవుటయ్యారు. కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (11 బంతుల్లో 6; 1 ఫోర్) నిరాశపరిచాడు.
43.4 ఓవర్లలోనే
ఎస్‌డీఎన్‌వీ ప్రసాద్ (64 బంతుల్లో 66; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో సౌరభ్ కుమార్ (26 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించడంతో ఆంధ్ర స్కోరు 200 దాటింది. ఒడిశా బౌలర్లలో బిప్లాబ్ సామంత్రే, గోవింద పొద్దార్ 3 వికెట్ల చొప్పున తీశారు. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒడిశా జట్టు 43.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది.
ఓపెనర్ స్వస్తిక్ సామల్ (0) ఆడిన తొలి బంతికే అవుటైనా... ఓం ముండే (111 బంతుల్లో 91; 7 ఫోర్లు), గోవింద పొద్దార్ (105 బంతుల్లో 89; 9 ఫోర్లు) ఒడిశా విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 166 పరుగులు జోడించారు.
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో నెగ్గిన ఆంధ్ర జట్టు గ్రూప్ ‘డి’లో నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 31న జరిగే నాలుగో లీగ్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర జట్టుతో తలపడుతుంది.
ఒక్క మ్యాచ్‌లో ‘హిట్’.. రెండింటిలో ఫ్లాప్ షో!
ఆంధ్ర కెప్టెన్, టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన నితీశ్ రెడ్డి.. ఒకే ఒక్క వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో ఆంధ్ర ఢిల్లీ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక రైల్వేస్‌తో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి బ్యాట్‌తో అదరగొట్టాడు. ఐదో నంబర్ బ్యాటర్‌గా వచ్చి 41 బంతుల్లో 55 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఓ వికెట్ కూడా పడగొట్టాడు.
ఇక తాజాగా సోమవారం ఒడిషాతో మ్యాచ్‌లో మాత్రం నితీశ్ రెడ్డి నిరాశపరిచాడు. కేవలం ఆరు పరుగులే చేసి నిష్క్రమించాడు. అదే విధంగా ఒకే ఒక వికెట్ తీయగలిగాడు. ఇప్పటి వరకు ఇలా అతడి ప్రదర్శన మిశ్రమంగా ఉంది.
చదవండి: ఇంగ్లండ్, పాక్ కాదు.. టీ20 వరల్డ్‌కప్ సెమీస్ చేరే జట్లు ఇవే!


