వయస్సును తక్కువగా చూపించి దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లో ఆడిన హైదరాబాద్ క్రికెటర్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రెండేళ్ల నిషేధం విధించింది. బోర్డు అధికారిక అండర్–16 టోర్నీ విజయ్ మర్చంట్ ట్రోఫీలో మర్కట్ట రామ్‌చరణ్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగాడు.
లీగ్ దశలో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలపై రామ్‌చరణ్ మూడు సెంచరీలు నమోదు చేశాడు. అయితే రామ్‌చరణ్ వయసుకు సంబంధించిన సందేహం కారణంగా వచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) విచారణ జరిపింది.
విచారణలో రామ్‌చరణ్‌కు రెండు వేర్వేరు తేదీలతో ‘బర్త్ సర్టిఫికెట్ ’లు ఉన్నట్లు, అతను తన వయసును తక్కువగా చూపించి అండర్–16 టోర్నీలో ఆడినట్లు తేలింది. దాంతో బీసీసీఐ అతడిని రెండేళ్ల పాటు అన్ని రకాల క్రికెట్ నుంచి నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత రామ్‌చరణ్ మళ్లీ ఆడవచ్చని...అయితే ఎలాంటి వయో విభాగంతో సంబంధం లేకుండా కేవలం సీనియర్ స్థాయిలోనే బరిలోకి దిగాల్సి ఉంటుందని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.


