భారత దేశవాలీ స్టార్ క్రికెటర్ ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో చరిత్ర సృష్టించాడు. ఈ లీగ్ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. కొద్ది రోజుల కిందటే కర్నాలీ యాక్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ప్రియాంక్.. చిట్వాన్ రైనోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 90 పరుగులు చేశాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ ఆటగాడు అరంగేట్రంలో చేసిన అత్యధిక స్కోర్ ఇదే.
ప్రియాంక్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యాక్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. యాక్స్ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు.
విదేశీ ప్లేయర్లు మ్యాక్స్ ఓడౌడ్ (30 బంతుల్లో 20 పరుగులు), మార్క్ వాట్ (21 బంతుల్లో 16) పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆఖర్లో పవన్ సర్రాఫ్ (16 బంతుల్లో 27 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో యాక్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. రైనోస్ బౌలర్లలో సోహైల్ తన్వీర్ (4-0-26-1), రవి బొపారా (3-0-18-1) పొదుపుగా బౌలింగ్ చేశారు.
అనంతరం 167 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రైనోస్‌కు దీపక్ బొహారా (36 బంతుల్లో 42) శుభారంభాన్ని అందించాడు. కెప్టెన్ కుసాల్ మల్లా (15 బంతుల్లో 20), సైఫ్ జైబ్ (16 బంతుల్లో 38) సహకారంతో రవి బొపారా (36 బంతుల్లో 52) రైనోస్‌ను గెలుపు వాకిటి వరకు చేర్చాడు. చివరి ఓవర్‌లో 2 పరుగులు చేయాల్సిన తరుణంలో అర్జున్ సౌద్ సిక్సర్ బాది రైనోస్‌ను గెలిపించాడు. యాక్స్ బౌలర్లలో సోంపాల్ కామీ (4-0-33-2) మెరుగైన ప్రదర్శన చేశాడు.
కాగా, ప్రియాంక్ పంచల్ ఇటీవలే భారత దేశవాలీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి పరాయి దేశ లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాడు. భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే భారత క్రికెట్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలి. ప్రియాంక్‌కు ముందు టీమిండియా గబ్బర్‌గా పిలువబడే శిఖర్ ధవన్ నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. ఈ లీగ్ గతేడాదే పురుడు పోసుకుంది.
దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ప్రియాంక్.. టీమిండియాకు మాత్రం ఆడలేకపోయాడు. గుజరాత్‌కు చెందిన 35 ప్రియాంక్ 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటున, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించాడు.
చదవండి: IRE vs BAN: రహీమ్, లిట్టన్ దాస్ సెంచరీలు.. బంగ్లాదేశ్ భారీ స్కోర్


