రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్‌ | Shikhar Dhawan Set To Marry Longtime Girlfriend Sophie Shine: Report | Sakshi
Sakshi News home page

రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్‌

Jan 5 2026 7:38 PM | Updated on Jan 6 2026 12:49 PM

Shikhar Dhawan Set To Marry Longtime Girlfriend Sophie Shine: Report

టీమిండియా మాజీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ త్వరలోనే వివాహ బంధంలో అడుగుపెట్టబోతున్నాడు. తన ప్రేయసి సోఫీ  షైన్‌ను మనువాడబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా శిఖర్‌- సోఫీల పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్‌ వర్గాలతో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నట్లు హిందుస్తాన్‌ టైమ్స్‌ వెల్లడించింది. అత్యంత వైభవోపేతంగా జరిగే ఈ వేడుకకు ఇప్పటికే సన్నాహకాలు మొదలయ్యాయని పేర్కొంది. ‘‘శిఖర్‌ ధావన్‌ జీవితంలో ఇదొక కొత్త అధ్యాయం.

ఈ వేడుకను సానుకూల వాతావరణంలో జరుపుకోవాలని వారిద్దరు భావిస్తున్నారు’’ అని ధావన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. శిఖర్‌ ధావన్‌ స్వయంగా పెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా శిఖర్‌ ధావన్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషా ముఖర్జీని గతంలో వివాహం చేసుకున్నాడు.

పదకొండేళ్ల కుమారుడు
డివోర్సి, ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆయేషాను ప్రేమించిన ధావన్‌ 2011లో ఆమెను పెళ్లాడాడు. ఆమెతో కుమారుడు జొరావర్‌ ధావన్‌ సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట 2023లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో పదకొండేళ్ల జొరావర్‌ను తల్లి ఆయేషా తనతో పాటు ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లింది.

తన కుమారుడిని నేరుగా కలుసుకునే వీలు కూడా లేకుండా పోయిందంటూ ధావన్‌ ఎన్నోసార్లు ఇన్‌స్టా వేదికగా పోస్టులు పెట్టాడు. ఒంటరిగా మిగిలిపోయిన అతడి జీవితంలోకి ఐరిష్‌ అమ్మాయి సోఫీ షైన్‌ వచ్చింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మ్యాచ్‌ సందర్భంగా దుబాయ్‌లో వీరిద్దరు తొలిసారి జంటగా కనిపించారు.

రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం
తద్వారా తన ప్రేమ బంధాన్ని బహిర్గతం చేసిన ధావన్‌.. అప్పటి నుంచి సోఫీతో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తున్నాడు. మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేసిన సోఫీ.. ఓ ప్రముఖ కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో ఉన్నట్లు సమాచారం. జీవితంలో మరోసారి ప్రేమను వెదుక్కున్న శిఖర్‌ ధావన్‌.. రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.

రెండో పెళ్లికి సిద్ధమైన టీమిండియా మాజీ స్టార్ శిఖర్ ధావన్

ఇకపై గబ్బర్‌కు అంతా మంచే జరగాలని.. శిఖర్‌- సోఫీల వివాహ బంధం కలకాలం నిలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కాగా 2010- 2022 మధ్య భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన శిఖర్‌ ధావన్‌.. 34 టెస్టుల్లో 2315, 167 వన్డేల్లో 6793, 68 టీ20లలో 1759 పరుగులు సాధించాడు. 

ఓపెనర్‌గా సత్తా చాటిన గబ్బర్‌ ఖాతాలో టెస్టుల్లో ఏడు. వన్డేల్లో 17 సెంచరీలు ఉన్నాయి. జట్టులో చోటు కరువు కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధావన్‌.. ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement