ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారిన ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్ (ఏఆర్‌సీఎఫ్) కో–ఫౌండర్ సాదిక్ ఇష్రార్ షేక్– భత్కల్‌లో తన పరిచయాలను వాడుకుని అక్కడి వారినీ ఐఎంలో చేర్చుకున్నాడు. 2005 నుంచి విధ్వంసాలు ప్రారంభించిన ఐఎం పేరు 2007లో బయటకు పడింది. ఈ ఉగ్రవాదుల గుట్టు 2008లో వీడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన సాదిక్ ఇష్రార్ షేక్ మాదిరిగానే కర్ణాటకలోని భత్కల్‌కు చెందిన అన్నదమ్ములు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌లకూ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్‌తో (సిమి) సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురికీ పరిచయం ఏర్పడింది.
రియాజ్, ఇక్బాల్‌లు ముంబైలో ఉంటూ గ్యాంగ్‌స్టర్స్‌గా మారారు. అక్కడే ‘ఆర్‌ఏఎన్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠా ఏర్పాటు చేసి, నేరాలు చేసేవారు. ఓ హత్య కేసులో ముంబై పోలీసుల నుంచి ఒత్తిడి పెరగటంతో భత్కల్‌కు వెళ్లి కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నారు. తర్వాత ఈ ఇద్దరూ కూడా సాదిక్ బాటలోనే ఐఎంలో చేరారు. భత్కల్ సోదరులు, సాదిక్ కలిసి ఐఎంలోకి అటు ఆజంగఢ్, ఇటు భత్కల్ ప్రాంతాలకు చెందిన పలువురు యువకుల్ని చేర్చారు. వీరిలో కొందరు అక్రమంగా సరిహద్దులు దాటి వెళ్లి పాక్‌లో శిక్షణ పొంది వచ్చారు.
పాకిస్తాన్ ప్రమేయం లేకుండా కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించిన ఈ దేశవాళీ ఉగ్రవాద సంస్థ పేలుడు పదార్థాలనూ స్థానికంగానే సమకూర్చుకుంది. వారణాసిలోని దశాశ్వమేధఘాట్‌లో 2005 ఫిబ్రవరి 23న తొలి పేలుడుకు పాల్పడింది. అదే ఏడాది జూలై 29న యూపీలో శ్రమ్‌జీవి ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 29న ఢిల్లీలోని సరోజినీ మార్కెట్, 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్ మోచన్ ఆలయం, అదే ఏడాది జూలై 11న ముంబై లోకల్ రైళ్లు, 2007 మే 22న గోరఖ్‌పూర్‌లో, అదే ఏడాది ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ లేజేరియంల్లో పేలుళ్లకు పాల్పడి అనేక మందిని పొట్టనపెట్టుకుంది.
అయినా ఇదంతా చేస్తున్నదెవరో ఏ ఒక్క నిఘా సంస్థకూ తెలియలేదు. 2007 నవంబర్ 23న లక్నో, ఫరీదాబాద్, వారణాసిల్లో వరుస పేలుళ్లు జరిగాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు వివిధ మీడియా సంస్థలకు ఓ ఈ–మెయిల్ వచ్చింది. దీని ద్వారానే తొలిసారిగా ఇండియన్ ముజాహిదీన్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఆ ఉగ్రవాద సంస్థ పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా నిఘా సంస్థలు చాన్నాళ్ల వరకు ఏమీ చేయలేకపోయాయి. ఫలితంగా 2008 మేలో జైపూర్ పేలుళ్లు జరిగాయి. తర్వాత ఐఎం ఉగ్రవాదులు ఆ ఏడాది జూలైలో గుజరాత్‌ను టార్గెట్ చేశారు. అహ్మదాబాద్‌లో భారీ విధ్వంసానికి కుట్రపన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘ది పూల్ ఆఫ్ ఆల్ టెర్రరిస్టు’ అని పేరుపెట్టి, ఐఎం 2008 జూలై 26న అహ్మదాబాద్‌లో 17 పేళ్లకు పాల్పడ్డారు.

సూరత్‌లోనూ కొన్ని పేలని బాంబులు పోలీసులకు దొరికాయి. ఈ బాంబుల్లో కొన్నింటిని ఉగ్రవాదులు వాహనాల్లో అమర్చారు. అక్కడే ఐఎం గుట్టు వీడటానికి అవసరమైన తొలి ఆధారం దొరికింది. రియాజ్ భత్కల్ కుర్లాలో ఉండగా బాంద్రాలో యాద్గార్ ఫ్యామిలీ రెస్టరెంట్ నిర్వహించే అఫ్జల్ ఉస్మానీతో పరిచయం ఏర్పడింది. ఒకప్పుడు వాహన చోరీలకు పాల్పడిన ఇతడికి ముంబైలో ఉన్న అనేక మంది దొంగలతో పరిచయాలు ఉన్నాయి.
అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లకు పథకం వేసిన సాదిక్, రియాజ్‌లు అందుకు అవసరమైన వాహనాల సరఫరా బాధ్యతల్ని అఫ్జల్ ఉస్మానీకి అప్పగించారు. ఉస్మానీ ముంబైలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాహన చోరులతో కార్లను దొంగతనం చేయించి; వాటిని అహ్మదాబాద్, సూరత్‌లకు చేర్చాడు. ఈ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు రియాజ్ ఆదేశాల మేరకు ఆతిఫ్ అమీన్ అనే ఐఎం ఉగ్రవాది ముంబై వెళ్లి అఫ్జల్‌ను కలిశాడు. పేలుళ్లు జరిగిన వెంటనే వారిద్దరూ అక్కడి నుంచి రైలులో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి జామియానగర్‌లోని బాట్లా హౌస్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో కొన్నాళ్లు ఉండి వచ్చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు చేసిన ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు వాహనాల నంబర్ల ఆధారంగా ముంబైలో చోరీ అయినట్లు గుర్తించారు.
దీంతో మహారాష్ట్ర ఏటీఎస్, క్రైమ్‌బ్రాంచ్‌లు రంగంలోకి దిగి, నలుగురు వాహనచోరుల్ని పట్టుకుని విచారించాయి. అఫ్జల్ ఉస్మానీ ఆదేశాల మేరకు పని చేశామని వారు వెల్లడించారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఉస్మానీ 2008 ఆగస్టు 21న ఉత్తరప్రదేశ్‌లో చిక్కాడు. ఇతడి ఇంటరాగేషన్‌లోనే రియాజ్ పేరు, ఇతర వివరాలు బయటపడ్డాయి. తనకు వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియదని చెప్పిన ఉస్మానీ– ఓసారి మాత్రం బాట్లా హౌస్‌కు వెళ్లానని, అక్కడి ఎల్–18 ఫ్లాట్‌లో డెన్ ఉందని బయటపెట్టాడు.
ఆ అపార్ట్‌మెంట్‌పై నిఘా పెట్టిన అహ్మదాబాద్, ముంబై పోలీసులు అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని, వారి వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేశారు. 2008 సెప్టెంబర్ 19న ఇన్‌స్పెక్టర్ మోహన్‌చంద్ శర్మ నేతృత్వంలోని బృందం ఆ ఫ్లాట్‌పై దాడి చేసింది. అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇన్‌స్పెక్టర్ శర్మతో పాటు ఉగ్రవాదులు ఆతిఫ్ అమీన్, మహ్మద్ సాజిద్ చనిపోయారు. ఆ ఎన్‌కౌంటర్‌లో సజీవంగా చిక్కిన మరో ఉగ్రవాది ఆరిజ్ ఖాన్ విచారణలో ఐఎం గుట్టు వీడి, ఉగ్రవాదుల అరెస్టులు ప్రారంభమై దుశ్చర్యలకు బ్రేక్ పడింది.
(బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ తర్వాత దేశ వ్యాప్తంగా అరెస్టులు జరిగాయి. వీటిని తప్పించుకోవడానికి రియాజ్, ఇక్బాల్, సాదిక్ సహా అనేక మంది గజ ఉగ్రవాదులు హైదరాబాద్ బాటపట్టారు. ఇక్కడికే ఎందుకు వచ్చారు? ఎవరి వద్ద షెల్టర్ పొందారు..? తదితర వివరాలతో తుది భాగం ‘చలో హైదరాబాద్!’ వచ్చే వారం)
-శ్రీరంగం కామేష్


