ఢిల్లీ క్యాబ్ ఇన్సిడెంట్ గుర్తు చేసుకున్న ప్రియాంక
తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి తాజాగా మీడియాతో షేర్ చేసుకుంది ప్రియాంక చోప్రా. ఆమె నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’. త్వరలోనే ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన గురించి చెబుతూ.. తల్లి మధు చోప్రా ధైర్యసాహసాలపై ప్రశంసలు కురిపించింది.
‘మేము ఒకరోజు ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి క్యాబ్‌లో బయటకు వెళ్తున్నాం. అర్థరాత్రి 11 గంటలు అవుతుంది. క్యాబ్‌లో అమ్మ, నేను మాత్రమే ఉన్నాం. కొంచెం దూరం వెళ్లిన తర్వాత క్యాబ్ డ్రైవర్ సడెన్‌గా రూట్ మార్చాడు. వేరే దారిలోకి కారుని తీసుకెళ్లాడు. ఆ దారిలో ఎవరూ లేకపోవడంతో ‘ఈ వైపు ఎందుకు వెళ్తున్నావు’ అని అమ్మ అడిగితే..‘షార్ట్‌కట్’ అని డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. అమ్మకు అనుమానం వచ్చింది.
ప్రమాదాన్ని ముందే పసిగట్టి, వెంటనే వెనుక సీట్లో కూర్చోనే క్యాబ్ డ్రైవర్ గొంతు గట్టిగా పట్టుకుంది. మెయిన్ రోడ్డుపైకి వెళ్లాలని హెచ్చరించింది. అంతటి ఆగకుండా డ్రైవర్‌ని చెప్పదెబ్బ కొట్టిమరీ.. మెయిన్ రోడ్డు వైపుకి వచ్చేలా చేసింది. ఆ సమయంలో అమ్మ గట్టిగా అరిచింది కూడా. ‘టీనేజ్ వయసున్న నా కూతురితో ఉన్నాను. మర్యాదగా మెయిన్ రోడ్డువైపు వెళ్లండి’ అని సీరియస్ అయింది. అమ్మను అలా చూసి షాకయ్యాను. దాదాపు నాలుగు నెలల వరకు ఆమెను వాదించేందుకు సాహసం చేయలేదు.
బహుషా ఒంటరిగా ఉంటే అమ్మ అంత గట్టిగా అరిచేది కాకపోవచ్చు. భయపడేది కూడా. కానీ పక్కన నేను ఉండడంతో..తల్లిలోని రక్షించే గుణం బయటకు వచ్చింది. అమ్మలో అలాంటి యాంగిల్, అంత ధైర్యాన్ని ఎప్పుడూ చూడలేదు’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.
‘ది బ్లఫ్’ విషయానికొస్తే.. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 19వ శతాబ్దపు కరీబియన్ నేపథ్యంలో సాగే ఈ కథలో తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పోరాడే మహిళగా ప్రియాంక కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రియాంక.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’లో హీరోయిన్‌గా నటిస్తోంది.


