బాడీబిల్డర్‌ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు.... | Fitness Trainer Vinod Channa Comments On John Abraham Diet And Reveals Why His Body Cant Digest Even Simple Foods | Sakshi
Sakshi News home page

John Abraham Diet: బాడీబిల్డర్‌ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు....

Feb 21 2026 11:08 AM | Updated on Feb 21 2026 11:50 AM

Fitness Trainer Vinod Channa Interesting Comments On John Abraham Diet

పుష్టిగా కండలు తిరిగి ఉన్నవారిని చూస్తే సాధారణంగా ఆరోగ్యవంతులు అనుకుంటాం. ఎలాంటివి తిన్నా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం ఉందని కూడా భావిస్తాం. కానీ అది నిజం కాదని కొంత మంది కండల వీరులు మనకి చెప్పకనే చెబుతుంటారు. అలాంటి కండల వీరుడే జాన్‌ అబ్రహాం. బాలీవుడ్‌ హీమ్యాన్స్‌లో ఒకరుగా పేరొందాడు. తెరమీద ప్రత్యర్ధుల బెండు తీసే ఈ హీరోకి కనీసం బెండకాయను తిని కూడా అరిగించుకునే శక్తి లేదట. సాక్షాత్తూ జాన్‌ అబ్రహాం ఫిట్‌నెస్‌ ట్రైనరే ఇటీవల ఈ విషయం వెల్లడించాడు.

సెలబ్రిటీ ట్రైనర్‌ వినోద్‌ చన్నా ఇటీవల ఓ పోడ్‌ కాస్టర్‌తో మాట్లాడుతూ ‘‘జాన్‌ అబ్రహం గ్లాడ్‌ రాగ్స్‌ సూపర్‌ మోడల్‌గా ఉన్నప్పుడు నా దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చాడు. ఆ సమయలలో అతను రివటలా, చాలా  సన్నగా ఉండేవాడు.  తాను అందాల పోటీల్లో పాల్గొంటున్నాను కాబట్టి కేవలం 1-2 నెలల్లో భారీగా కండలు తిరిగిన శరీరంగా తనను మార్చాలని  కోరుకున్నాడు. అప్పటికే అతను 67 నెలల నుంచి  వ్యాయామం చేస్తున్నాడు. ఆ తర్వాత  నేను అతనిని 92 కిలోల బరువు,  కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా తయారు చేశాను’’అంటూ ఆయన గుర్తుచేసుకున్నాడు. 

ఈ సందర్భంగా  జాన్‌ అబ్రహం... ఫిజిక్‌లోని  విశిష్టతలను కూడా అతను వివరించాడు. జాన్‌ శరీరం వ్యాయమ సమయంలో చాలా వేగంగా  స్పందిస్తుందనీ, అతని అబ్స్‌ (ఉదర కండరాలు) ఒక వేలు లోతు కలిగి ఉంటాయని చెప్పాడు. అయితే అతని 100 శాతం ఫిజిక్‌ ఏ సినిమాలోనూ చూపించలేదని ట్రైనర్‌ అభిప్రాయపడ్డాడు. దాదాపు 90 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ కేవలం 45 శాతం ఫ్యాట్‌ మాత్రమే ఉండడం అంటే అలాంటి కండలు తిరిగిన శరీరం నమ్మశక్యం కాదని అది జాన్‌కి మాత్రమే స్వంతమని కొనియాడాడు.  

దీనికి కారణమైన జాన్‌  ఆహారపు అలవాట్లను వివరిస్తూ, 53 ఏళ్ల వయసులోనూ ఈ ఫిజిక్‌ మెయిన్‌టెయిన్‌ చేసేందుకు జాన్‌ చాలా కఠినంగా ఉంటాడని చెప్పాడు. కఠినమైన డైట్‌ కారణంగా ప్రస్తుతం అతని శరీరం కొన్ని ఆహారాలను జీర్ణం చేసుకోలేకపోతుందని తెలిపాడు.  ‘‘ జాన్‌ అబ్రహాం... శాఖాహారి, కానీ అతను గుడ్లు మాత్రం ఆహారంగా తీసుకుంటాడు.   అతను డైట్‌ విషయంలో మరీ ఎక్కువ కఠినంగా ఉంటాడు. అతను కొంచెం కూడా చక్కెర తినడు. ఒకవేళ తింటే అతనికి దగ్గు వస్తోంది. అలా కొన్ని ఆహార  పదార్ధాల పట్ల అతని శరీరం మరీ సెన్సిటివ్‌గా మారిపోయింది. అందుకే నేను అతనికి అలా దేన్నీ కూడా  పూర్తిగా ఆపవద్దని సలహా ఇస్తుంటాను’’ అంటూ వివరించాడు.

‘అతను చాలా సంవత్సరాలుగా కఠినమైన డైట్‌లో ఉన్నాడు. అతను బెండకాయ కూర తింటే అతనికి కడుపునొప్పి  వచ్చేస్తుంది. ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా వాటిని తినలేదు కాబట్టి  మీరు అస్సలు తిననిది ఏదైనా అకస్మాత్తుగా తనలోకి వస్తే, శరీరం దానిని జీర్ణించుకోదు ఎందుకంటే అది ఒక నిర్దిష్ట ఆహారానికి బాగా అలవాటు పడింది. అందుకే నేరుగా చక్కెర కాకపోయినా, నేను అతనికి కొంత బెల్లం లేదా చక్కెర లను మరో రూపంలో తినమని చెబుతున్నాను’’ అంటూ జాన్‌ అభ్రహాం ట్రైనర్ వెల్లడించాడు. ఏదేమైనా  అతి సర్వత్రా వర్జయేత్‌ అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారం కూరగయాల్ని కూడా అరిగించుకోలేని జాన్‌ అబ్రహాం పరిస్థితి...డైట్‌ రూట్‌లో ఉన్నవారికి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సంగతే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement