breaking news
Vinod Channa
-
బాడీబిల్డర్ ఆ హీరో... బెండకాయ తిన్నా అరగదు....
పుష్టిగా కండలు తిరిగి ఉన్నవారిని చూస్తే సాధారణంగా ఆరోగ్యవంతులు అనుకుంటాం. ఎలాంటివి తిన్నా జీర్ణం చేసుకోగల సామర్ధ్యం ఉందని కూడా భావిస్తాం. కానీ అది నిజం కాదని కొంత మంది కండల వీరులు మనకి చెప్పకనే చెబుతుంటారు. అలాంటి కండల వీరుడే జాన్ అబ్రహాం. బాలీవుడ్ హీమ్యాన్స్లో ఒకరుగా పేరొందాడు. తెరమీద ప్రత్యర్ధుల బెండు తీసే ఈ హీరోకి కనీసం బెండకాయను తిని కూడా అరిగించుకునే శక్తి లేదట. సాక్షాత్తూ జాన్ అబ్రహాం ఫిట్నెస్ ట్రైనరే ఇటీవల ఈ విషయం వెల్లడించాడు.సెలబ్రిటీ ట్రైనర్ వినోద్ చన్నా ఇటీవల ఓ పోడ్ కాస్టర్‌తో మాట్లాడుతూ ‘‘జాన్ అబ్రహం గ్లాడ్ రాగ్స్ సూపర్ మోడల్‌గా ఉన్నప్పుడు నా దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చాడు. ఆ సమయలలో అతను రివటలా, చాలా సన్నగా ఉండేవాడు. తాను అందాల పోటీల్లో పాల్గొంటున్నాను కాబట్టి కేవలం 1-2 నెలల్లో భారీగా కండలు తిరిగిన శరీరంగా తనను మార్చాలని కోరుకున్నాడు. అప్పటికే అతను 67 నెలల నుంచి వ్యాయామం చేస్తున్నాడు. ఆ తర్వాత నేను అతనిని 92 కిలోల బరువు, కండలు తిరిగిన బాడీ బిల్డర్‌గా తయారు చేశాను’’అంటూ ఆయన గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా జాన్ అబ్రహం... ఫిజిక్లోని విశిష్టతలను కూడా అతను వివరించాడు. జాన్ శరీరం వ్యాయమ సమయంలో చాలా వేగంగా స్పందిస్తుందనీ, అతని అబ్స్ (ఉదర కండరాలు) ఒక వేలు లోతు కలిగి ఉంటాయని చెప్పాడు. అయితే అతని 100 శాతం ఫిజిక్ ఏ సినిమాలోనూ చూపించలేదని ట్రైనర్ అభిప్రాయపడ్డాడు. దాదాపు 90 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నప్పటికీ కేవలం 45 శాతం ఫ్యాట్ మాత్రమే ఉండడం అంటే అలాంటి కండలు తిరిగిన శరీరం నమ్మశక్యం కాదని అది జాన్‌కి మాత్రమే స్వంతమని కొనియాడాడు. దీనికి కారణమైన జాన్ ఆహారపు అలవాట్లను వివరిస్తూ, 53 ఏళ్ల వయసులోనూ ఈ ఫిజిక్ మెయిన్‌టెయిన్ చేసేందుకు జాన్ చాలా కఠినంగా ఉంటాడని చెప్పాడు. కఠినమైన డైట్ కారణంగా ప్రస్తుతం అతని శరీరం కొన్ని ఆహారాలను జీర్ణం చేసుకోలేకపోతుందని తెలిపాడు. ‘‘ జాన్ అబ్రహాం... శాఖాహారి, కానీ అతను గుడ్లు మాత్రం ఆహారంగా తీసుకుంటాడు. అతను డైట్ విషయంలో మరీ ఎక్కువ కఠినంగా ఉంటాడు. అతను కొంచెం కూడా చక్కెర తినడు. ఒకవేళ తింటే అతనికి దగ్గు వస్తోంది. అలా కొన్ని ఆహార పదార్ధాల పట్ల అతని శరీరం మరీ సెన్సిటివ్‌గా మారిపోయింది. అందుకే నేను అతనికి అలా దేన్నీ కూడా పూర్తిగా ఆపవద్దని సలహా ఇస్తుంటాను’’ అంటూ వివరించాడు.‘అతను చాలా సంవత్సరాలుగా కఠినమైన డైట్లో ఉన్నాడు. అతను బెండకాయ కూర తింటే అతనికి కడుపునొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే తను చాలా సంవత్సరాలుగా వాటిని తినలేదు కాబట్టి మీరు అస్సలు తిననిది ఏదైనా అకస్మాత్తుగా తనలోకి వస్తే, శరీరం దానిని జీర్ణించుకోదు ఎందుకంటే అది ఒక నిర్దిష్ట ఆహారానికి బాగా అలవాటు పడింది. అందుకే నేరుగా చక్కెర కాకపోయినా, నేను అతనికి కొంత బెల్లం లేదా చక్కెర లను మరో రూపంలో తినమని చెబుతున్నాను’’ అంటూ జాన్ అభ్రహాం ట్రైనర్ వెల్లడించాడు. ఏదేమైనా అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. ప్రకృతి సిద్ధమైన సహజ ఆహారం కూరగయాల్ని కూడా అరిగించుకోలేని జాన్ అబ్రహాం పరిస్థితి...డైట్ రూట్లో ఉన్నవారికి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన సంగతే. -
త్వరలో పెళ్లి పీటలెక్కుతున్న ఇతన్ని గుర్తుపట్టారా?
ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ ( Anant Ambani ), రాధికా మర్చంట్ల ( Radhika Merchant ) వివాహం త్వరలో జరగబోతోంది. మార్చి 1 నుంచి 3 వరకు మూడు రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అనంత్ అంబానీ బరువు తగ్గడం, ఆ తర్వాత పెరగడం గురించి చాలా ఊహాగానాలు ఉన్నప్పటికీ అనంత్ అంబానీ కొన్ని నెలల్లోనే 108 కిలోలు ఎలా తగ్గగలిగారు అని అందరూ ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటారు. అప్పట్లో ఆయన అంతలా బరువు తగ్గడానికి ప్రధాన కారణం ముంబైకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ వినోద్ చన్నా. ఎవరీ వినోద్ చన్నా? దేశంలోని ప్రముఖ సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన వినోద్ చన్నా, ఒకప్పుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పర్సనల్ ట్రైనర్. కఠినమైన ఆహారం, వ్యాయామ నియమావళి ద్వారా కేవలం 18 నెలల్లో 108 కిలోల బరువు తగ్గడానికి అతను సహాయం చేశాడు. వినోద్ చన్నాది స్వయంగా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. అతను ఈ రోజు ఉన్న స్థితికి చేరుకోవడానికి చాలా కృషి చేశాడు. అతను ఒకప్పుడు చాలా బక్కపలచగా ఉండేవాడు. దీంతో అతన్ని అందరూ హేళన చేసేవారు. ఒక ఇంటర్వ్యూలో వినోద్ మాట్లాడుతూ.. తాను పెరిగే సమయంలో పోషకాహార లోపంతో బాధపడేవాడినని చెప్పాడు. ఫిట్నెస్ ట్రైనర్‌గా విజయం సాధించడానికి ముందు వినోద్ చన్నా హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డు వంటి చిన్న చిన్న పనులెన్నో చేశాడు. వినోద్ చన్నా పెరిగేకొద్దీ జీవితంలో ఫిట్నెస్ ప్రాముఖ్యతను గ్రహించి జిమ్‌లో చేరాడు. ఇదే అతని ప్రయాణాన్ని మలుపు తిప్పింది. అనంత్ అంబానీతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో వినోద్ చన్నా మాట్లాడుతూ.. బరువు తగ్గడంలో అనంత్ అంబానీ నిబద్ధతను తెలియజేశారు. అనంత్ అంబానీ కోసం అధిక ప్రోటీన్, హై ఫైబర్, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ప్రత్యేక డైట్ ప్లాన్ రూపొందించినట్లు వినోద్ చన్నా తెలిపారు. ఆయన ఫీజు ఎంతంటే.. అనంత్ అంబానీతో పాటు నీతా అంబానీ, కుమార్ మంగళం బిర్లా, అనన్య బిర్లా, జాన్ అబ్రహం, శిల్పా శెట్టి, హర్షవర్ధన్ రాణే, వివేక్ ఒబెరాయ్, అర్జున్ రాంపాల్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు వినోద్ చన్నా పర్సనల్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎంత చార్జ్ చేస్తారో చెప్పలేదు కదా.. 12 ట్రైనింగ్ సెషన్ల ప్యాకేజీకి వినోద్ చన్నా రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. -
నూరు నుంచి ఆరుకు తెచ్చారు!
స్టార్ ట్రైనర్ ఆరేళ్ల క్రితం నా తొలి మూవీ విడుదలైంది. మంచి పేరొచ్చింది కానీఆఫర్స్ రాలేదు. ఆ సమయంలో భుక్తి కోసం ఏ పని దొరికితే ఆ పని చేశాను. సరైన ఫుడ్ తినలేక, జిమ్‌కి వెళ్లలేక, సరైన పని లేకపోవడంతో రెండు మూడేళ్లలో బాగా వెయిట్ పెరిగాను. దాదాపుగా 100 కిలోల బరువుకి చేరుకున్నా. అదే సమయంలో ‘మాయ’ సినిమా ఛాన్సొచ్చింది. అందులో స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రావడం నా ఎంట్రీ షాట్. ఆ షాట్లో లావుగా ఉంటే బాగుండదని డెరైక్టర్ నీలకంఠ అన్నారు. స్లిమ్‌గా మారమని ఓ రకంగా అల్టిమేటమ్ ఇచ్చారాయన. అలా నా ట్రాన్స్‌ఫర్మేషన్‌కి ఫస్ట్ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఆ తర్వాత హీరో రానాకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఆ టైమ్‌లో రానా నాకు ఎక్విప్మెంట్ ఇచ్చాడు, డైట్ చెప్పాడు. అంతేకాదు... తన పర్సనల్ ట్రైనర్ కునాల్‌ని పరిచయం చేశారు. అలా రానా నాకు చాలా హెల్ప్ చేశారు. హిందీ సినిమాతో... ‘మాయ’ సినిమా నుంచి నా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2015లో బాలీవుడ్ మూవీ ‘సనమ్ తేరీ కసమ్’ ఛాన్స్ వచ్చింది. అప్పుడు హీరో జాన్ అబ్రహాంను కలిస్తే... తన ట్రైనర్ వినోద్ చన్నాను పరిచయం చేశారు. నిజానికి వినోద్ చన్నా రెమ్యూనరేషన్ నా తాహతుకు మించిందే. అయినా... రెండు నెలల కోసం జాయినయ్యాను. ఆ తర్వాత నా ప్రొడక్షన్ హౌజ్, ప్రొడ్యూసర్ నాకు సాయం చేశారు. చాలా పెద్ద స్టార్ ట్రైనర్ అయినప్పటికీ వినోద్ చాలా సింపుల్ పర్సన్. ఫిట్నెస్ విషయంలో అత్యున్నత పరిజ్ఞానం ఉంది ఆయనకు. చాలా డిఫరెంట్ వర్కవుట్స్ చేయించేవాడు. టైగర్ వాక్, గొరిల్లా వాక్, క్రాబ్ వాక్... వంటివి భాగంగా ఉండే యానిమల్ ఫ్లో ఆయన చేయించే వెరైటీ వర్కవుట్స్‌కి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అలా ప్రతి రోజూ కనీసం ఒక్కటైనా కొత్త వర్కవుట్ చేయించడం వల్ల ఫిజిక్‌కి ఓ రకంగా షాక్ ఇచ్చినట్టు అయేది. దాంతో మన శరీరానికి వ్యాయామం అలవాటైపోయి, అది సులభం అయిపోవడం ఉండేది కాదు. వెజిటబుల్స్, చికెన్, ఎగ్‌వైట్స్, పెరుగు, ఆల్మండ్స్, వాల్నట్స్ వంటివి డైట్. వర్కవుట్ అయ్యాక మాత్రం ఒక ప్రొటీన్ షేక్ తాగేవాణ్ణి. రోజుకు గంటన్నర పాటు చేసిన అలాంటి వర్కవుట్స్‌తో 6 నెలల్లో సిక్స్‌ప్యాక్ వచ్చింది. నూరు కిలోల నుంచి ‘ఆరు’ పలకల దేహానికి వచ్చానంటే ట్రైనర్ చలవే. ఇంకా ముందే వచ్చేదేమో కానీ, షార్ట్ కట్లో వెళ్లాలనుకోలేదు. ఖరీదైనా... ఆయనే మిన్న... ఇప్పటికీ ట్రైనర్‌గా వినోద్‌నే ప్రిఫర్ చేస్తున్నా. ఆయన చాలా ఎక్స్పెన్సివ్ అయినా... ఇకపై కూడా మానను. మన లోపల ఏం జరుగుతుంది అనేది ఆయన సరిగ్గా అంచనా వేయగలడు. టోటల్ బాడీని ఆయన స్క్రూటీనీ చేస్తాడు. ఆయన వల్ల నేను మరింత డిసిప్లిన్‌గా మారాను. ప్రస్తుతం నా బరువు 81 కిలోలు. - హర్షవర్ధన్ రాణే


