టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్‌తో వన్డేలకు ముందు ఈ రన్‌మెషీన్ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఆదేశాల మేరకు
అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే బరిలో దిగాడు.

రెండు మ్యాచ్‌లు కంప్లీట్
కనీసం రెండు మ్యాచ్‌లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్‌లోనూ ఫామ్‌ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్‌పై 77 పరుగులు సాధించాడు.
మూడోదీ ఆడతానని చెప్పి..
ఇక న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్‌కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.
అందుబాటులో లేడు
అయితే, తాజాగా ఢిల్లీ కోచ్ సరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్‌లో రైల్వేస్ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్‌లో గల కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్-2 ఇందుకు వేదిక. రిషభ్ పంత్ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.
చదవండి: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్


