టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దాదాపు మూడు నెలల తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు. శ్రేయస్ తన పునరాగమనంలో ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రెగ్యులర్ కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ పిక్క గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ బాధ్యతలను ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అయ్యర్‌కు అప్పగించింది. ఈ విషయాన్ని ఎంసీఎ సెక్రటరీ డాక్టర్ ఉన్మేష్ ఖాన్విల్కార్ ధ్రువీకరించారు. జనవరి 6న హిమాచల్ ప్రదేశ్‌తో, జనవరి 8న పంజాబ్‌తో జరిగే కీలక మ్యాచ్‌ల్లో ముంబై జట్టును అయ్యర్ నడిపించనున్నాడు.
కాగా ఈ టోర్నీలో ఆడి అయ్యర్ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లో శ్రేయస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగితే అతడికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ లభిస్తుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో అయ్యర్ కూడా భాగంగా ఉన్నాడు.
కానీ ఈ సిరీస్‌కు ముందు శ్రేయస్ ఫిట్‌నెస్ టెస్టుల్లో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో శ్రేయస్ పొత్తికడుపు భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో అతడి స్ప్లీన్ (ప్లీహం) చీలికకు గురై, అంతర్గత రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని సిడ్నీలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి ఐసీయూలో చికిత్స అందించారు.
మూడు రోజుల తర్వాత శ్రేయస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అనంతరం డిసెంబర్ 25న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో చేరిన శ్రేయస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (CoE)లో హై-ఇంటెన్సిటీ టెస్టులను విజయవంతంగా అతడు పూర్తి చేసుకున్నాడు. అయ్యర్ దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లే.
చదవండి: IPL 2026: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన ప్రకటన


