సీఎస్‌కే జెర్సీలో రహమాన్ (పాత ఫొటో)
బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఫ్రాంఛైజీ క్రికెట్‌లో మేటి లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రసారాలను తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు.. "భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను తమ జట్టు నుంచి విడుదల చేసింది.
బాధ, వేదనకు గురిచేసింది
మార్చి 26, 2026 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి అతడిని తొలగించింది. జాతీయ భద్రతకు సంబంధించి ఎలాంటి ముప్పు పొంచి ఉందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. అయితే, ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రజలను బాధ, వేదనకు గురిచేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ (IPL) ప్రసారాలను దేశంలో నిలిపివేయాలని బ్రాడ్‌కాస్టర్లకు విజ్ఞప్తులు వచ్చాయి. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధికారుల అనుమతితో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం’’ అని బంగ్లాదేశ్ పేర్కొంది.
కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీల మీద హత్యాకాండ నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలనే డిమాండ్లు రాగా.. బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది.
కుదరని చెప్పిన బీసీసీఐ
అంతేకాదు.. టీమిండియాతో సెప్టెంబరులో ఆడాల్సిన టీ20, వన్డేల గురించి బంగ్లా బోర్డు షెడ్యూల్ విడుదల చేయగా.. బీసీసీఐ మాత్రం దీనిని ధ్రువీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా భారత్‌లో తమ మ్యాచ్‌లు ఆడబోడమని బంగ్లా బోర్డు ప్రకటించింది.
తమ మ్యాచ్‌ల వేదికను శ్రీలంకకు మార్చాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి లేఖ రాసింది. అయితే, ఇప్పటికే టోర్నీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తికావడం.. బంగ్లాదేశ్‌తో ఆడే ప్రత్యర్థులు తమ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ వేదికలను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ సైతం బీసీసీఐ వాదనవైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.


