బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించేందుకు ఐసీసీ సుముఖంగా లేనట్లు సమాచారం. క్రిక్‌బజ్ అందించిన వివరాల ప్రకారం.. బీసీబీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మధ్య ఉన్న ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
ముస్తఫిజుర్ రహమాన్ అవుట్
ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా మెజారిటీ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్న బీసీసీఐకే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బ తిన్న నేపథ్యంలో క్రికెట్‌కు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్న కారణంగా ఆ దేశపు పేస్ బౌలర్ ముస్తఫిజుర్ రహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్ దీనిని అంగీకరిస్తూ ముస్తఫిజుర్‌ను తమ జట్టునుంచి తొలగించింది. అనంతరం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
మ్యాచ్‌లను తరలించాలంటూ ఐసీసీకి విజ్ఞప్తి
భారత్‌లో మ్యాచ్‌లు ఆడితే తమ ఆటగాళ్లకు భద్రతా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత స్థితిలో తాము భారత్‌లో ప్రయాణించలేమని స్పష్టం చేసింది. కాబట్టి టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లా ఆడాల్సిన 4 లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ తమ తొలి మూడు లీగ్ మ్యాచ్‌లను కోల్‌కతాలో, చివరి మ్యాచ్‌ను ముంబైలో ఆడాల్సి ఉంది.
‘బంగ్లాదేశ్ ప్రభుత్వం సూచన మేరకు మా క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించరాదని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల మధ్య అన్నింటికంటే ఆటగాళ్ల భద్రతే మాకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ మేం ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరుతున్నాం.
బీసీసీఐ ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేకపోతోంది. ఇక మొత్తం జట్టుకు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తుంది. ఒక్క క్రికెటర్ల గురించే కాకుండా మేం అభిమానులు, సహాయక సిబ్బంది, మీడియా గురించి కూడా ఆలోచిస్తున్నాం’ అని బీసీబీ ప్రకటన జారీ చేసింది.
తరలింపు కష్టమే!
బంగ్లా బోర్డు ఎన్ని డిమాండ్‌లు చేసినా ఇప్పటికిప్పుడు మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. టోర్నమెంట్ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. ఇలాంటి స్థితిలో బీసీబీ వాదన సహేతుకం కాదని భారత బోర్డు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
‘ఎవరో ఒకరి ఇష్టానుసారం మ్యాచ్‌లను మార్చడం సాధ్యం కాదు. ఏర్పాట్లపరంగా ఎన్నో సమస్యలు ఉంటాయి. బంగ్లాతో ఆడే ప్రత్యర్థి జట్లు ఇప్పటికే విమాన టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఒక్కో రోజు మూడు మ్యాచ్‌లు ఉండే వాటిలో ఒకటి శ్రీలంకలో జరుగుతుంది.
ప్రసారకర్తలు మ్యాచ్‌లకు ఎలా సిద్ధమవుతారు. కాబట్టి మాటలు చెప్పినంత సులువు కాదు చేసి చూపించడం’ అని ఆయన అన్నారు. మరో వైపు.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని తమ దేశ ప్రభుత్వానికి బంగ్లా మాజీ క్రికెటర్లు విజ్ఞప్తి చేశారు.


