యాషెస్ ఐదో టెస్ట్ సందర్భంగా.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో భావోద్వేగ క్షణాలు కనిపించాయి. బాండీ బీచ్ హీరోలకు మైదానంలో స్టాండింగ్ ఒవేషన్ లభించింది. తన ప్రాణాలను పణంగా పెట్టి అనేక మంది ప్రాణాలను రక్షించిన బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్ అహ్మద్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆ క్షణాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో (SCG) బాండీ బీచ్ హీరో అహ్మద్ అల్-అహ్మద్, ఇతరులకు ఘనమైన స్వాగతం లభించింది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఈ రియల్ హీరోకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. అహ్మద్‌తో పాటు ఘటనలో ఇద్దరు చిన్నారులను కాపాడి గాయపడ్డ చాయా డాడోన్ కూడా వచ్చింది. ఆమె కాలికి బుల్లెట్ గాయం కావడంతో స్ట్రెచ్చర్ సాయంతో వచ్చారు. అలాగే ఘటన సమయంలో తక్షణమే స్పందించిన(ఫస్ట్‌రెస్పాండర్స్) వైద్యులు, పోలీసు అధికారులు అందరినీ ప్రత్యేకంగా గౌరవించారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ కేరీ, కామెరాన్ గ్రీన్‌లు ఇంగ్లండ్ ప్లేయర్స్‌తో కలిసి బౌండరీ వద్ద నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆ వీరులంతా మైదానంలోకి వచ్చిన సమయంలో అంతా లేచి నిలబడ్డారు. చప్పట్లతో స్టేడియం మొత్తం మారుమోగించారు.

బాండీ బీచ్ ఘటనలో మరణించిన 15 మంది బాధితుల పేర్లను.. మిమ్మల్ని మరువబోం (forever in our hearts)అనే పదాలతో ప్రదర్శించారు. ఆ సమయంలో ప్లేయర్లు సహా పలువురు కంటతడి పెట్టారు.
The SCG rises as one to acknowledge the first responders and community heroes who bravely acted during the Bondi attack 🙏 pic.twitter.com/HUl7M34Lcx
— 7Cricket (@7Cricket) January 3, 2026
గ్రౌండ్ మధ్యలోకి వచ్చాక తన గుండెలపై చేయి ఉంచుకుని.. ఆపై పైకి ప్రదర్శించాడు. ఆ సమయంలో స్టేడియంలో చప్పట్లు మరింత బిగ్గరగా వినిపించాయి. జాతీయ గీతం ఆలాపన జరిగాక.. క్రికెట్ పెద్దలు, ఆటగాళ్లు ఆ వీరులతో చేతులు కలిపారు. అహ్మద్‌ను ఆసీస్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజా ప్రత్యేకంగా అభినందించడం అత్యంత భావోద్వేగ క్షణంగా నిలిచింది.

సిరియాలో పట్టి.. ఆస్ట్రేలియాకు వలస వచ్చిన అహ్మద్ అల్ అహ్మద్(43).. డిసెంబర్ 14న సిడ్నీ బాండీ బీచ్ ఉగ్రదాడి ఘటనలో సూపర్ హీరోగా నిలిచారు. లంచ్ చేస్తున్న సమయంలో తుపాకుల మోత విన్న ఆయన.. ధైర్యం చేసి ముందుకు దూకారు. కాల్పులు జరుపుతున్న సాజిద్ అక్రమ్‌పైకి దూకి గన్ లాక్కుని నిలువరించారు. ఆ సమయంలో మరో ఉగ్రవాది నవీద్ అక్రమ్ జరిపిన కాల్పుల్లో కాలికి, భుజానికి తూటాలు తగిలి అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అప్పటికే భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది.
సకాలంలో చికిత్స అందడంతో అహ్మద్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ హీరో కోసం జరిపిన ఫండ్ రైజింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. అంతేకాదు.. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి అహ్మద్‌ను పరామర్శించారు. స్థానికురాలైన చాయా డాడోన్ కాల్పులు జరుగుతున్న సమయంలో ఇద్దరు పిల్లలకు అడ్డుగా నిలబడింది. దీంతో ఆమె కాలికి గాయాలయ్యాయి. ఈ ఇద్దరినీ ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరులుగా గుర్తించింది.


