బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కేబినేట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు.
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడిగా వెంకటేష్ ప్రసాద్ ఎంపికైన వారం రోజులకే ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం గమనార్హం. కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు.
ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక క్రికెట్ మ్యాచ్ కూడా జరగలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చిన్నస్వామి మైదానంలో అభిమానులు సందడి నెలకోనుంది.
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందే టీమిండియా స్టార్, ఆర్సీబీ లెజెండ్ విరాట్ కోహ్లి ఈ మైదానంలో ఆడనున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి చిన్నస్వామి మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అంతకంటే ముందే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నట్లు సమాచారం. వానికి
వాస్త విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025-26 గ్రూపు-డి మ్యాచ్‌లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది. గ్రూపు-డిలో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహించే ఢిల్లీ జట్టు కూడా ఉంది. కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉంది.
దీంతో ఢిల్లీ ఆడే మ్యాచ్‌లను అలూర్ నుంచి చిన్నస్వామికి తరలించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ హాజారే టోర్నీ డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజున ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుతో చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడే ఛాన్స్ ఉంది.
చదవండి: IND vs SA: గంభీర్ సంచలన నిర్ణయం..? గిల్‌కు ఊహించని షాక్!


