ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడో టీ20 ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ముల్లాన్‌పూర్‌లో ఎదురైన ఘోర పరాభావానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే ధర్మశాలకు చేరుకున్న భారత జట్టు శనివారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గోనుంది.
ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1 సమంగా ఉంది. సిరీస్ ఆధిక్యం పెంచుకునేందుకు మూడో టీ20ల్లో భారత్ తమ తుది జట్టులో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టీ20ల్లో ఘోరంగా విఫలమైన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సంజూకు చోటు!
గిల్ స్దానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది గిల్ టీ20 జట్టులోకి తిరిగి వచ్చేంతవరకు భారత ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, శాంసన్‌లు ఆరంభించేవారు. ఓపెనర్‌గా సంజూ మూడు సెంచరీలు కూడా బాదాడు.
అయితే గిల్ రీ ఎంట్రీతో శాంసన్ ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. ప్రధాన జట్టులో ఉన్నప్పటికి చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. దీంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వస్తున్నాయి. గిల్ కోసం సంజూను బలి చేస్తారా? అని మాజీలు సైతం మండిపడుతున్నారు.
ఈ క్రమంలో శాంసన్‌ను మళ్లీ తుది జట్టులోకి తీసుకు రావాలని గంభీర్ నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ టీ20ల్లో గిల్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది గిల్ 14 ఇన్నింగ్స్‌లలో 23.90 సగటుతో కేవలం 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని టీ20ల నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మరి నిజంగానే గంభీర్.. మూడో టీ20 నుంచి గిల్‌ను తప్పిస్తాడా? అని తెలియాలంటే ఆదివారం వరకు వేచి ఉండాల్సిందే.
మూడో టీ20 కోసం భారత తుది జట్టు(అంచనా)
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
చదవండి: GOAT Tour India 2025: 70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే!


