సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా.. అదే జోరును కొనసాగించలేకపోయింది. ముల్లన్‌పూర్ వేదికగా రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగం చేయగా.. అది కాస్తా బెడిసికొట్టింది.
ఓపెనర్, వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. వన్‌డౌన్‌లో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పంపించింది మేనేజ్‌మెంట్. సఫారీలు విధించిన 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అక్షర్ 21 బంతుల్లో 21 పరుగులు చేసి నిష్క్రమించాడు.
మరోవైపు.. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ (17)తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (5) దారుణంగా విఫలమయ్యాడు. మిగిలిన వారిలో హార్దిక్ పాండ్యా (20), జితేశ్ శర్మ (17 బంతుల్లో 27) ఫర్వాలేదనిపించగా.. తిలక్ వర్మ (34 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. అయితే, సఫారీ బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 162 పరుగులకే టీమిండియా కుప్పకూలడంతో పరాజయం ఖరారైంది.
ఈ నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా నాయకత్వ బృందాన్ని విమర్శించాడు. ‘‘అక్షర్ మీ జట్టులోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడై ఉండవచ్చు. కానీ ఇలాటి భారీ ఛేదన సమయంలో మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు?
నా అభిప్రాయం ప్రకారం ఈ మ్యాచ్‌లో మీరు చేసిన అతి పెద్ద తప్పు ఇదే. అక్షర్ బ్యాటింగ్ చేయగలడు. కానీ అతడిని ముందు తోసి చిక్కుల్లో పడేయడం సరికాదు. ఒకవేళ గిల్ కంటే ముందు అభిషేక్ శర్మ అవుటై ఉంటే.. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం అక్షర్‌ను పంపించారనుకోవచ్చు.
కానీ ఇక్కడ అలా జరుగలేదు. అభిషేక్‌తో పాటు మరో లెఫ్టాండర్ అక్షర్‌ను పంపారు. ఏం చేస్తున్నారో అర్థమే కాలేదు. ప్రయోగాలు చేయడం మంచిదే. అయితే, ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదు’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్‌ల తీరును స్టెయిన్ తప్పుబట్టాడు.
కాగా సిరీస్ ఆరంభానికి ముందు సూర్య మాట్లాడుతూ.. తమ జట్టులో ఓపెనింగ్ జోడీ మాత్రమే ఫిక్స్‌డ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. మిగతా వారంతా ఏ స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తమ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
అయితే, టీ20 ఓపెనర్‌గా గిల్‌ను పంపడం కోసం.. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్‌పై వేటు వేశారు. కానీ టీ20 జట్టులో పునరాగమనం చేసిన నాటి నుంచి గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. కటక్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టీ20లో టీమిండియా 101 పరుగులతో భారీ విజయం సాధించింది. తాజా మ్యాచ్‌లో సఫారీలు గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేశారు.


