ఆసియా క్రికెట్ మండలి మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్- యూఏఈ (IND vs UAE) మ్యాచ్‌తో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.
దంచికొట్టిన భారత బ్యాటర్లు
ఇందులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్ త్రివేది (38) కూడా రాణించాడు.
ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్, ఓపెనర్ ఆయుశ్ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక యూఏఈ బౌలర్లలో యుగ్ శర్మ, ఉద్దిశ్ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్ డిసౌజా, కెప్టెన్ యాయిన్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
కుదేలైన యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్
ఇక భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ యాయిన్ రాయ్ (17), షాలోమ్ డిసౌజా (4).. వన్‌డౌన్ బ్యాటర్ అయాన్ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్ రేయాన్ ఖాన్ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్ హుదాదాద్ డకౌట్ అయ్యాడు.
మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఐదో నంబర్ బ్యాటర్ పృథ్వీ మధు (50), ఉద్దిశ్ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ సలే అమీన్ (20 నాటౌట్) తన వంతు ప్రయత్నం చేశాడు.
234 పరుగుల తేడాతో జయభేరి
అయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ రెండు వికెట్లు తీయగా.. కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.
చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్య
Vaibhav Sooryavanshi moves. The action responds. 😮💨
A classy grab from our Boss Baby 👏
Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/5w0MUUWzzZ— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025


