ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ! | Why Vaibhav Suryavanshi 171 Vs UAE Will Not Counted In U19 Record Books | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!

Dec 12 2025 4:50 PM | Updated on Dec 12 2025 5:01 PM

Why Vaibhav Suryavanshi 171 Vs UAE Will Not Counted In U19 Record Books

శతకాన్ని సెలబ్రేట్‌ చేసుకున్న వైభవ్‌ (PC: X)

ఆసియా క్రికెట్‌ మండలి ఆధ్వర్యంలో అండర్‌-19 ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌కు శుక్రవారం తెరలేచింది. గ్రూప్‌-‘ఎ’ మ్యాచ్‌లో భాగంగా యునైటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE).. భారత యువ జట్టును ఢీకొట్టింది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో టాస్‌ ఓడిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది.

56 బంతుల్లోనే సెంచరీ
ఓపెనర్లలో కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (4) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విధ్వంసకర శతకంతో దుమ్ములేపాడు. కేవలం 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. ఓ దశలో డబుల్‌ సెంచరీ దిశగా పయనించాడు. అయితే, ఉద్దిశ్‌ సూరి బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడంతో వైభవ్‌ సునామీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 95 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. తొమ్మిది ఫోర్లు, పద్నాలుగు సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించాడు. అతడికి తోడు ఆరోన్‌ జార్జ్‌ (69), విహాన్‌ మల్హోత్రా (69).. వేదాంత్‌ త్రివేది (38), అభిజ్ఞాన్‌ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్‌) రాణించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ప్చ్‌.. సారీ వైభవ్‌ సూర్యవంశీ!
ఇదిలా ఉంటే.. యూత్‌ వన్డేల్లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే ఓ సెంచరీ బాదాడు. ఇటీవల ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుపై 52 బంతుల్లోనే శతక్కొట్టి రికార్డు సృష్టించాడు. అయితే, తాజాగా వైభవ్‌ ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌లో సాధించిన శతకానికి మాత్రం యూత్‌ వన్డేల్లో చోటు దక్కదు.

కారణం ఇదే
అండర్‌-19 ఆసియా కప్‌లో అసోసియేట్‌ జట్లతో జరిగే మ్యాచ్‌లకు యూత్‌ వన్డే హోదా లేదు. అందుకే యూఏఈపై వైభవ్‌ సాధించిన సెంచరీకి రికార్డుల్లో స్థానం లేకుండా పోయింది. 

అయితే, తదుపరి (డిసెంబరు 14)న పాకిస్తాన్‌తో జరిగే ఆసియా కప్‌ మ్యాచ్‌లో గనుక వైభవ్‌ సెంచరీ బాదితే అది రికార్డుల్లోకి ఎక్కే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆసియా కప్‌ టోర్నీలో టెస్టు హోదా కలిగిన జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు మాత్రమే యూత్‌ వన్డే హోదా ఉంటుంది.

ఇప్పటికే మూడు శతకాలు
ఇదిలా ఉంటే.. ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లలో అసోసియేట్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌లకు మాత్రం యూత్‌ వన్డే స్టేటస్‌ ఉంటుంది. అంటే.. ప్రపంచకప్‌ టోర్నీలో యూఏఈతో భారత్‌ ఆడే మ్యాచ్‌ల రికార్డులు పరిగణనలోకి వస్తాయి.

ఇక సీనియర్‌ టీ20 క్రికెట్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఇప్పటికే మూడు శతకాలు సాధించాడు. ఐపీఎల్‌-2025లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున.. ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో యూఏఈపైనా.. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర మీదా వైభవ్‌ శతక్కొట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement