మొన్న ఐపీఎల్.. నిన్న ఆసియాకప్.. నేడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. ఆ 14 ఏళ్ల యువ సంచలనం దూకుడును ఎవరూ ఆపలేకపోతున్నారు. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో చిన్ననాటి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలను గుర్తు చేస్తున్నాడు. అవతలి ఎండ్‌లో బౌలర్ ఎవరైన డోంట్ కేర్. అతడికి తెలిసిందల్లా బంతి బౌండరీకి తరలించడమే.
అతడు క్రీజులో ఉన్నాడంటే సీనియర్ బౌలర్లకు సైతం గుండెల్లో రైళ్లు పరిగెత్తాల్సిందే. వయస్సుతో సంబంధం లేకుండా సీనియర్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు అత్యద్భుతం. 15 ఏళ్ల నిండకముందే రికార్డులకు కేరాఫ్ అడ్రాస్‌గా మారిన ఆ చిచ్చరపిడుగు ఎవరో ఈపాటికే మీకు ఆర్ధమైపోయింటుంది. అతడే భారత అండర్-19 స్టార్ ఓపెనర్, బిహార్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. మందకొడి పిచ్‌పై ఇతర బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడిన చోట.. వైభవ్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.
31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన బిహార్ జట్టును వైభవ్ తన అద్బుత బ్యాటింగ్‌తో ఓ యోధుడిలా పోరాడాడు. ఆకాష్ రాజ్, అయూష్‌తో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఈ క్రమంలో సూర్యవంశీ కేవలం 58 బంతుల్లో సెంచరీని పూర్తి చేశాడు. అయితే ఇది అతడి స్టాండర్డ్స్ ప్రకారం "స్లో నాక్" అనే చెప్పాలి.
ఎందుకంటే టీ20లలో అతని సగటు స్ట్రైక్ రేట్ 217.88. అంతకుముందు వైభవ్ టీ20ల్లో 32, 35 బంతుల్లో రెండు శతకాలు బాదాడు. ఓవరాల్‌గా 61 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం ఆ లక్ష్యాన్ని మహారాష్ట్ర 7 వికెట్లు కోల్పోయి చేధించింది.
తొలి ప్లేయర్‌గా..
ఈ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. . సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (14 ఏళ్ల 250 రోజులు) రికార్డు నెలకొల్పాడు. వైభవ్‌కు ముందు ఈ రికార్డు మహారాష్ట్ర ఆటగాడు విజయ్ జోల్ పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో జోల్ ఆల్‌టైమ్ రికార్డును ఈ బిహారీ బ్రేక్ చేశాడు.
సీనియర్ జట్టు ఎంట్రీ ఎప్పుడు?
వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదేవిధంగా రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో బిహార్ సీనియర్ ఆటగాళ్లు తడబడినప్పటికీ వైభవ్ మాత్రం మేఘాలయపై 93 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఈ ఏడాదిలో వైభవ్ కేవలం 15 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి మూడు సెంచరీలు సాధించాడు.
దీంతో అతడు త్వరలోనే భారత సీనియర్ టీ20 జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇంత చిన్న వయస్సులో అతడి నిలకడైన ఆట తీరు, సీనియర్ బౌలర్లపై అతను చూపిస్తున్న ఆధిపత్యం బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌ను ఖచ్చితంగా ఆలోచింపజేస్తోంది. అతడు వయస్సు తక్కువ కావడం వల్ల టీ20 ప్రపంచ కప్ 2026 నాటికి జట్టులోకి రాకపోయినా.. 15 ఏళ్ల నిండగానే జాతీయ జట్టు తరపున డెబ్యూ చేయడం ఖాయం.
గిల్ చోటుకు ఎసరు?
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అరేంగ్రటం చేయడానికి కనీస వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. వైభవ్ మార్చి 27, 2011 న జన్మించాడు. కాబట్టి అతడు మార్చి 27, 2026 తర్వాతే సీనియర్ జాతీయ జట్టు తరపున ఆడేందుకు అర్హత సాధిస్తాడు. అంటే వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్‌లో భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించాడు.
ఒకవేళ అతడు రాబోయో రోజుల్లో కూడా ఇదే జోరును కొనసాగిస్తే వైస్ కెప్టెన్ గిల్ స్ధానం డెంజర్‌లో పడినట్లే. ప్రస్తుతం టీ20ల్లో భారత జట్టు ఇన్నింగ్స్‌ను అభిషేక్ శర్మ, గిల్ ప్రారంభిస్తున్నారు. అభిషేక్ దుమ్ములేపుతున్నప్పటికి గిల్ ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు. తదుపరి మ్యాచ్‌లో కూడా గిల్ ఇదే పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే అతడి స్ధానాన్ని శాంసన్ లేదా వైభవ్‌తో భర్తీ చేసే అవకాశముంది.
స్పీడ్ గన్స్‌ను ఎదుర్కోగలడా?
అయితే సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి ఇది సరైన వయస్సు కాదు అని, జోష్ హాజిల్‌వుడ్, కగిసో రబాడ లేదా మార్క్ వుడ్ వంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం అతనికి చాలా కష్టమని కొంతమంది మాజీలు వాదిస్తున్నారు. కానీ సూర్యవంశీ ఇప్పటికే ఐపీఎల్‌లో మహ్మద్ సిరాజ్, వెటరన్ ఇషాంత్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ వంటి స్పీడ్‌స్టార్లను ఉతికారేశాడు. కాబట్టి అతడికి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడం పెద్ద టాస్క్ ఏమి కాదు.
చదవండి: IND vs SA: అతడిపై మీకు నమ్మకం లేదా? మరెందుకు సెలెక్ట్ చేశారు?


