నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌ | Suryakumar Yadav Reflects On His And Shubman Gills Failure | Sakshi
Sakshi News home page

నాతో పాటు అతడి వల్లే ఈ ఓటమి: సూర్యకుమార్‌

Dec 12 2025 8:14 AM | Updated on Dec 12 2025 10:14 AM

Suryakumar Yadav Reflects On His And Shubman Gills Failure

ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. 214 పరుగుల లక్ష్య చేధనలో 19.1 ఓవర్లలో 162 రన్స్‌కే టీమిండియా కుప్పకూలింది.

భారత బ్యాటర్లలో తిలక్‌ వర్మ(34 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(5), శుభ్‌మన్‌ గిల్‌(0), అభిషేక్‌ శర్మ(17) వంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు. సఫారీ పేసర్‌ బార్ట్‌మాన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడి, జాన్సెన్‌, సిప్లమా తలా రెండు వికెట్లు సాధించారు.

అంతకుముందు క్వింటన్‌ డికాక్‌(90) చెలరేగడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో ప్రోటీస్‌ సమం చేసింది. ఇక ఈ ఓటమిపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయడంలో విఫలమయ్యామని అతడు చెప్పుకొచ్చాడు.

అభిషేక్ ఒక్కడే కాదు..
"ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం మినహా ఏదీ మాకు అనుకూలించలేదు. టాస్ గెలిచిన తర్వాత తొలుత బ్యాటింగ్ తీసుకుని ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్ సమయానికి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందనే తొలుత బౌలింగ్ తీసుకున్నాము. కానీ ఆరంభంలోనే ఈ వికెట్‌పై ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం. 

ఆ తర్వాత ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలో మా బౌలర్లు గ్రహించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ఇది నేర్చుకునే ప్రక్రియ. మేము ఈ ఓట‌మి నుంచి మేము పాఠాలు నేర్చుకుంటాము.  తప్పిదాలను సరిదిద్దుకొని ముందుకు సాగుతాం. మంచు ప్రభావం ఎక్కువ‌గా ఉంది. 

మా మొద‌టి ప్లాన్ విఫ‌ల‌మైన‌ప్పుడు.. వెంట‌నే మా సెకెండ్ ప్లాన్‌ను అమ‌లు చేయ‌లేక‌పోయాము. కానీ సౌతాఫ్రికా బౌల‌ర్లు మాత్రం రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ ఉన్న‌ప్ప‌టికి ఎలా బౌలింగ్ చేయాలో మాకు చూపించారు. మా త‌దుప‌రి మ్యాచ్‌లో వారిని మేము అనుస‌రిస్తాము.

బ్యాటింగ్‌లో నేను, శుభ్‌మన్ ఇంకొంచెం బాధ్యత తీసుకోవాల్సింది. అభిషేక్ అద్భుతంగా ఆడుతున్నాడు, కానీ ప్రతిసారీ అతనిపైనే ఆధారపడలేము. శుభ్‌మన్ తొలి బంతికే అవుటయ్యాడు. ఆ స‌మ‌యంలో నేను ఎక్కువ క్రీజులో ఉండి, ఛేజింగ్ బాధ్య‌త‌ను నా భుజాల‌పై వేసుకోవాల్సింది. 

ఇక అన్ని ఫార్మాట్ల‌లోనూ అక్ష‌ర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్‌లో అత‌డిని ప్ర‌మోట్ చేశాము. దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌లో మా ప్లాన్ విజ‌య‌వంతం కాలేదు. ఈ ఓట‌మిని మేము జీర్ణించుకోలేక‌పోతున్నాము. అయిన‌ప్ప‌టికి మా త‌దుప‌రి మ్యాచ్‌లో గ‌ట్టిగా క‌మ్‌బ్యాక్ ఇస్తాం. ధర్మశాలలో కలుద్దాం" అని సూర్య పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేష‌న్‌లో సూర్య పేర్కొన్నాడు.
చదవండి: యువ భారత్‌కు ఎదురుందా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement