దుబాయ్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ టెస్టు క్రికెట్‌లో అన్నింటికంటే అత్యుత్తమ స్థాయిలో ఉండాలని తాము ఆశించామని... మూడు ఫైనల్ మ్యాచ్‌లు కూడా తమ అంచనాలను అందుకున్నాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీఈఓ సంజోగ్ గుప్తా అభిప్రాయ పడ్డారు.
2025లో జరిగిన ఫైనల్స్ కోసం లార్డ్స్ స్టేడియం పూర్తిగా నిండిపోవడం ఐసీసీ చరిత్రలో నిలిచిపోయే క్షణమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగ్గా... వరుసగా న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా విజేతలుగా నిలిచాయి.
"డబ్ల్యూటీసీ ఫైనల్స్ అంటే మిగతా టెస్టుల తరహాలో కాదు. ఈ ఫార్మాట్‌లో రెండేళ్ల శ్రమ తర్వాత రెండు అత్యుత్తమ జట్లు తలపడే సందర్భం. టెస్టు క్రికెట్ విలువ ఏమిటో ఈ మ్యాచ్‌లు చూపించాయి. డబ్ల్యూటీసీ మొదలు పెట్టినప్పుడు మేం ఆశించిన స్పందన ఇక్కడ వచ్చింది. మా అంచనాలు ఫైనల్స్ అందుకున్నాయి. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో భారత్ గానీ ఇంగ్లండ్ గానీ ఆడలేదు.
అయినా సరే స్టేడియం నిండిపోయింది. ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌పై అభిమానులు ఎంత ఆసక్తిని ప్రదర్శించారో ఇది చూపించింది. అన్నింటికి మించి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మరో ఆరు నెలల సమయం ఉన్నా కూడా ఎవరు ఫైనల్ చేరతారనే చర్చ అన్ని జట్లలో కనిపిస్తోంది. దీనికి అర్హత సాధించే క్రమంలో ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల ప్రాధాన్యం ఎంతో పెరిగింది" అని సంజోగ్ వ్యాఖ్యానించారు.
చదవండి: నేను.. అతడే ఈ ఓటమికి కారణం! ప్రతీసారి కూడా: సూర్యకుమార్


