న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలకు స్టార్ ఆటగాళ్లతో భారత్ సిద్ధమైంది. ఫిబ్రవరి 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) గురువారం ప్రకటించింది. రెండేళ్లకోసారి జరిగే ఈ పోటీల్లో మహిళల విభాగంలో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌కాగా... పురుషుల విభాగంలో టీమిండియా రెండుసార్లు కాంస్య పతకాలు సాధించింది.
‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా జట్లను ఎంపిక చేశాం. మహిళల జట్టును రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సింధు ముందుండి నడిపిస్తుంది’ అని ‘బాయ్’ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల జట్టులో భారత నంబర్‌వన్, ప్రపంచ 13వ ర్యాంకర్ లక్ష్య సేన్‌తోపాటు ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, రైజింగ్ స్టార్స్ ఆయుశ్ శెట్టి, హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి ఉన్నారు.
భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వీ శర్మ, రక్షిత శ్రీ, మాళవిక బన్సోద్, ట్రెసా జాలీ, పుల్లెల గాయత్రి, ప్రియా కొంజెంగ్‌బమ్, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో.
భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, తరుణ్ మన్నేపల్లి, సాతి్వక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయిప్రతీక్, హరిహరన్.


