కాన్వే, హే అర్ధ సెంచరీలు
వెస్టిండీస్‌తో రెండో టెస్టు
వెల్లింగ్టన్: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్ విలియమ్సన్ (37; 7 ఫోర్లు), డారిల్ మిచెల్ (25; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.
విండీస్ బౌలర్ల ధాటికి కివీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్ టిక్నెర్ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్ బౌలర్లలో అండర్సన్ ఫిలిప్ 3, రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
జాన్ క్యాంప్‌బెల్ (14), అండర్సన్ ఫిలిప్ (0) అవుట్ కాగా... బ్రాండన్ కింగ్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు), కవెమ్ హడ్జ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, మిచెల్ రే చెరో వికెట్ పడగొట్టారు.


