రెండో టి20లో భారత్ పరాజయం
51 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు
క్వింటన్ డికాక్ 90
ఆదివారం మూడో టి20 మ్యాచ్
తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ తర్వాతి పోరులో సునాయాసంగా తలవంచింది. పేలవ బౌలింగ్‌తో 22 అదనపు పరుగులు ఇచ్చి మరీ ప్రaత్యర్థి భారీ స్కోరుకు కారణమైన జట్టు బ్యాటింగ్‌లోనూ తేలిపోయింది. బ్యాటింగ్‌లో డికాక్ మెరుపులతో పాటు మంచులో కూడా పట్టు తప్పకుండా వేసిన బౌలింగ్‌తో సఫారీలు పైచేయి సాధించారు. హైదరాబాదీ తిలక్ వర్మ ఒంటరి పోరాటం మినహా ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.
న్యూ చండీగఢ్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య టి20 సిరీస్ 1–1తో సమమైంది. గురువారం జరిగిన రెండో టి20లో దక్షిణాఫ్రికా 51 పరుగుల తేడాతో భారత్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 90; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... చివర్లో డొనొవాన్ ఫెరీరా (16 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు.
భారత్ ఏకంగా 22 ఎక్స్‌ట్రాలు ఇవ్వగా, ఇందులో 16 వైడ్‌లు ఉన్నాయి. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తిలక్ వర్మ (34 బంతుల్లో 62; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, బార్ట్‌మన్‌కు 4 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య మూడో టి20 ఆదివారం ధర్మశాలలో జరుగుతుంది.
సమష్టి ప్రదర్శన...
ఓపెనర్ డికాక్ దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను దూకుడుగా మొదలు పెట్టగా, హెన్‌డ్రిక్స్ (8) విఫలమయ్యాడు.అర్ష్ దీప్ ఓవర్లో 4, 6 కొట్టిన డికాక్ బుమ్రా ఓవర్లో మరో సిక్స్ బాదాడు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 53 పరుగులకు చేరింది. మార్క్‌రమ్ (26 బంతుల్లో 29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) నెమ్మదిగా ఆడగా, జోరు కొనసాగిస్తూ డికాక్ 26 బంతుల్లోనే (4 ఫోర్లు, 4 సిక్స్‌లతో) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వరుణ్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన మార్క్‌రమ్ అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు అర్ధ సెంచరీ తర్వాత డికాక్ తాను ఆడిన తర్వాతి 19 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. అయితే సెంచరీకి చేరువైన దశలో కీపర్ జితేశ్ చురుకుదనం కారణంగా డికాక్ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు.
బ్రెవిస్ (14) ఎక్కువ సేపు నిలవలేకపోయినా... ఫెరీరా, మిల్లర్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) భాగస్వామ్యం జట్టుకు భారీ స్కోరును అందించింది. బుమ్రా వేసిన చివరి ఓవర్లో ఫెరీరా రెండు సిక్సర్లు బాదాడు. తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా తర్వాతి 10 ఓవర్లలో 123 పరుగులు రాబట్టింది.
ఓపెనర్లు విఫలం...
శుబ్‌మన్ గిల్ (0) తాను ఆడిన తొలి బంతికే వెనుదిరగ్గా, 2 సిక్స్‌లు బాదిన అభిషేక్ శర్మ (17) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సూర్యకుమార్ (5) వైఫల్యాల బాట కొనసాగగా, మూడో స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ (21) పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే ఫోర్, సిక్స్‌తో ఖాతా తెరిచిన తిలక్ ఆ తర్వాత కూడా నాలుగు బంతుల వ్యవధిలో రెండు సిక్స్‌లు బాది ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఎన్‌గిడి బౌలింగ్‌లో మరో సిక్స్‌తో 27 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 20; 1 సిక్స్) ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత తిలక్, జితేశ్ శర్మ (17 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కలిసి గెలిపించేందుకు పోరాడినా లాభం లేకపోయింది.
14 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ 9 బంతుల వ్యవధిలో 5 పరుగులు మాత్రమే జోడించి చివరి 5 వికెట్లు కోల్పోయింది. సఫారీలు ఒకే ఒక వైడ్ వేయడం విశేషం!
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (రనౌట్) 90; హెన్‌డ్రిక్స్ (బి) వరుణ్ 8; మార్క్‌రమ్ (సి) అక్షర్ (బి) వరుణ్ 29; బ్రెవిస్ (సి) తిలక్ (బి) అక్షర్ 14; ఫెరీరా (నాటౌట్) 30; మిల్లర్ (నాటౌట్) 20; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–156, 4–160. బౌలింగ్:అర్ష్ దీప్ 4–0–54–0, బుమ్రా 4–0–45–0, వరుణ్ 4–0–29–2, అక్షర్ 3–0–27–1, పాండ్యా 3–0–34–0, దూబే 2–0–18–0.
భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 17; గిల్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) ఎన్‌గిడి 0; అక్షర్ (సి) హెన్‌డ్రిక్స్ (బి) బార్ట్‌మన్ 21; సూర్యకుమార్ (సి) డికాక్ (బి) యాన్సెన్ 5; తిలక్ (సి) మార్క్‌రమ్ (బి) ఎన్‌గిడి 62; పాండ్యా (సి) బ్రెవిస్ (బి) సిపామ్లా 20; జితేశ్ (సి) బార్ట్‌మన్ (బి) సిపామ్లా 27; దూబే (బి) బార్ట్‌మన్ 1;అర్ష్ దీప్ (సి) మిల్లర్ (బి) బార్ట్‌మన్ 4; వరుణ్ (సి) మార్క్‌రమ్ (బి) బార్ట్‌మన్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్) 162. వికెట్ల పతనం: 1–9, 2–19, 3–32, 4–67, 5–118, 6–157, 7–158, 8–162, 9–162, 10–162. బౌలింగ్: ఎన్‌గిడి 3.1–0–26–2, యాన్సెన్ 4–0–25–2, సిపామ్లా 4–0–46–2, ఫెరీరా 1–0–14–0, బార్ట్‌మన్ 4–0–24–4, లిండే 3–0–23–0.
అర్ష్‌దీప్ 13 బంతుల ఓవర్!
6, వైడ్, వైడ్, 0, వైడ్, వైడ్, వైడ్, వైడ్, 1, 2, 1, వైడ్, 1...అర్ష్ దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో 13 బంతుల వరుస ఇది! దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ వేసినఅర్ష్ దీప్ ఏకంగా 7 వైడ్‌లు వేశాడు. తొలి బంతిని డికాక్ లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదగా... మిగతా 5 లీగల్ బంతులను కూడా చక్కగా వేసిన అతను 5 పరుగులే ఇచ్చాడు. అయితే మంచు కారణంగా బంతిపై పట్టుతప్పి అతను వేసిన వైడ్‌లు భారత శిబిరంలో అసహనాన్ని పెంచాయి.


