భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు ఎగిరి గంతేసే శుభవార్త. ఇటీవల సౌతాఫ్రికాతో వరుస సెంచరీలతో దుమ్ములేపిన ఈ రన్‌మెషీన్ మరోసారి బ్యాట్ పట్టి మైదానంలో దిగనున్నాడు. అయితే, ఈసారి టీమిండియా తరఫున కాకుండా.. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లి ఆడనున్నాడు.
ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరు
ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) గురువారం ధ్రువీకరించింది. తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి తమకు స్వయంగా తెలిపాడని పేర్కొంది. ఈ క్రమంలోనే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) తాజా సీజన్ ప్రాబబుల్స్‌లో కోహ్లి పేరును చేర్చింది.
దీని గురించి డీడీసీఏ వర్గాలు ఇటీవల ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ..‘‘తాను విజయ్ హజారే ట్రోఫీ ఆడతానని విరాట్ కోహ్లి (Virat Kohli) డీడీసీఏకు సమాచారం ఇచ్చాడు. క్రికెట్‌లో అతడు కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు.
రిషభ్ పంత్ కూడా
ఇటీవల సౌతాఫ్రికాతో వన్డేల్లోనూ సెంచరీలు బాదాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్‌గా ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాడు. అయితే, అతడు ఈ దేశీ టోర్నీలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు మరింత స్ఫూర్తి పొందుతారు’’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. కోహ్లితో పాటు మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ పేరు కూడా ప్రాబబుల్స్ లిస్టులో ఉంది. ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీ తరపున మరోసారి బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
గంభీర్- అగార్కర్ ఒత్తిడి వల్లేనా?
కోహ్లి వరల్డ్‌క్లాస్ బ్యాటర్. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాత.. అత్యధిక సెంచరీలు (84) బాదిన రెండో ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
సౌతాఫ్రికాతో వన్డేల ద్వారా సూపర్ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. నిజానికి కొత్తగా నిరూపించుకునేది ఏమీ లేదు. అయితే, వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో ఉండాలంటే నిబంధనల ప్రకారం.. దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ దేశీ క్రికెట్ ఆడాల్సిందేనని యాజమాన్యం చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ముఖ్యంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో పంతం పట్టినట్లు ఊహాగానాలు వినిపించాయి. గత కొన్ని రోజులుగా వీరిద్దరు రో- కోల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. రోహిత్‌ను అనూహ్యంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం.. వరల్డ్‌కప్ ప్లాన్‌లో భాగంగానే ఇలా చేశామని అగార్కర్ చెప్పడం ఇందుకు నిదర్శనం.
అంతేకాదు అంతకుముందు వీరిద్దరు కలిసి రో-కో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించేలా ఒత్తిడి చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్- కోహ్లి.. వన్డేల్లో కొనసాగుతూ హవా చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బోర్డు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుని దేశీ టోర్నీల్లో ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇటీవల బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. రో-కో దేశీ క్రికెట్ ఆడాలని ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పడం గమనార్హం. కానీ పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్: ఢిల్లీ ప్రాబబుల్స్ జట్టు
విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, దేవ్ లక్రా, యుగళ్ సైనీ, దివిజ్ మెహ్రా, సుజల్ సింగ్, రజ్‌నీశ్ దాదర్, అమన్ భార్తి, గోవింద్ మిట్టల్, సుమిత్ బెనీవాల్, శుభమ్ దూబే, కేశవ్ దబాస్, రాహుల్ చౌదరి, సమర్థ్ సేత్, శివమ్ త్రిపాఠి, అన్మోల్ శర్మ, శివమ్ గుప్తా, లక్షయ్ తరేజా, మనన్ భరద్వాజ్, రౌనక్ వాఘేలా, మయాంక్ గుసైన్, కేశవ్ ఆర్‌సింగ్,, లక్ష్మణ్, దివాన్ష్ రావత్, ప్రణవ్ రాజ్‌వన్షీ, ప్రన్షు విజయరణ్.
చదవండి: వరల్డ్‌కప్ టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. భారత సంతతి ఆటగాళ్లకు చోటు


