భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశంలో క్రికెట్ ఓ మతం లాంటిది. అందుకే మిగతా ఏ క్రీడలకు లభించని క్రేజ్ ఈ ఆటకు మాత్రమే ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు ప్రసార మాధ్యమాలు ఎల్లప్పుడూ ముందే ఉంటాయి.
అనూహ్య రీతిలో
ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్వహించే టోర్నీలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా దండిగా ఆదాయం పొందాలనే యోచనతో ఉంటాయి. అయితే, అనూహ్య రీతిలో కొన్నాళ్ల క్రితం ఐసీసీ మీడియా హక్కులను వదులుకునేందుకు జియో హాట్‌స్టార్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి.
భారత్‌లో ఐసీసీ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కుల కోసం రెండేళ్ల క్రితం.. నాలుగేళ్ల కాలానికి గానూ జియో హాట్‌స్టార్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీని విలువ దాదాపు మూడు బిలియన్ డాలర్లకు పైమాటే. అయితే, టీ20 మెన్స్ ప్రపంచకప్-2026కు ముందు తాము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఈ సంస్థ ఐసీసీకి సమాచారం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
రేసులోకి ప్రసార్ భారతి!
ఆర్థిక నష్టాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు జియో హాట్‌స్టార్ తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో పాటు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఐసీసీ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులోకి ఊహించని విధంగా ప్రసార్ భారతి (ప్రభుత్వానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ) దూసుకువచ్చింది.
పూర్తి హక్కులు దక్కించుకోలేకపోవచ్చు
ఈ విషయం గురించి కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మొత్తానికి మొత్తంగా ఐసీసీ మీడియా హక్కులను ప్రసార్ భారతి దక్కించుకోలేకపోవచ్చు. అయితే, బ్రేకప్ విధానంలో కొన్ని మ్యాచ్‌లను ప్రసారం చేసే వీలు ఉండవచ్చు.
ఉదాహరణకు టీమిండియా స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు.. లేదంటే ఫార్మాట్లకు అతీతంగా టోర్నమెంట్‌ల వారీగా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందవచ్చు. ఏదో ఒక విధంగా ఐసీసీ మీడియా హక్కులలో భాగం కావడమే సంస్థ లక్ష్యం.
దూర్‌దర్శన్, డీడీ ఫ్రీడిష్.. ఓటీటీ ప్లామ్‌ఫామ్‌లు.. ఇలా వివిధ వేదికల ద్వారా మ్యాచ్‌ల ప్రసారానికి ఆసక్తిగా ఉన్నాము. ముందుగా చెప్పినట్లు మొత్తం ప్యాకేజీ మేము దక్కించుకోలేకపోవచ్చు. అయినప్పటికీ బిడ్డింగ్ వేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా టీమిండియా మ్యాచ్‌లనైనా ప్రసారం చేసే హక్కులు పొందాలని భావిస్తున్నాము’’ అని తెలిపినట్లు ఇన్‌సైడ్‌స్పోర్ట్ వెల్లడించింది.
చదవండి: IPL 2025: ఐపీఎల్ వేలం కౌంట్ డౌన్ షురూ.. అతడికి రూ. 20 కోట్లు పైమాటే!


