ప్రసిద్ధ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత, ఇన్వెస్ట్‌మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ “చరిత్రలోనే అత్యంత తీవ్రమైన పతనం” దిశగా సాగుతోందని సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లు చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెబుతున్నారు. అందులోభాగంగా ఎనిమిదో పాఠాన్ని తాజాగా ‘ఎక్స్’లో పంచుకున్నారు.
చరిత్ర చూడండి..
ఆర్థిక పతనాలు ఒక్కరోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణేల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్‌ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చరిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు.
ఈ పరిణామాలు ప్రపంచాన్ని “రుణ ఆర్థిక వ్యవస్థగా” మార్చాయని, దీని ఫలితంగా అమెరికా జపాన్ వంటి దేశాలు భారీ రుణభారంతో సతమతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డునపడుతున్నారన్నారు.
కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం వెండి విదేశాల్లో నిల్వ చేస్తానని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణెం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకొనే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుందని అన్నారు.
ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలం
ప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వ్‌నేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండి లను “దేవుని సొమ్ము”గా.. బిట్‌కాయిన్, ఈథీరియంను “ప్రజల డబ్బు”గా కియోసాకి అభివర్ణించారు.
ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా, సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని కియోసాకి పునరుద్ఘాటించారు. “వాళ్లే విజేతలు” అని, “ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది” అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు.
స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడంలేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికివారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ, బంగారం, వెండి, క్రిప్టోకరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ, రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళన ఉన్న పలువురికి ఆయన సందేశం ఇంకా ఆందోళన కలిగిస్తోంది.
LESSON # 8: How you can get richer as the world economy collapses.
CRASHES do not happen over night.
CRASHES take decades to occur.
For Example:
Silver crashed in 1965: when the US government turned silver coins into fake coins….
Violating Greshams Law which stated when…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 10, 2025


