ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ-20 పెట్రోల్) వినియోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల పెట్రోల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ చర్య కారణంగా.. రూ. 1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకంపై కొందరు ఆందోళనల చెందుతున్నారు. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉపయోగించే కార్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని, ఇప్పటికే.. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఈ-20 పెట్రోల్ తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ కంటే కూడా ఉత్తమంగా ఉందని గడ్కరీ అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్‌లో ఉపయోగించే ముడి పదార్థాలైన చెరకు, మొక్కజొన్న మొదలైన వాటి వినియోగం పెరుగుతుంది. ఇది రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేస్తుందని ఆయన అన్నారు.
ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం అమలు తర్వాత.. గతంలో ముడి చమురు దిగుమతులకు ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు రైతులకు చేరుతోందని, దీంతో అన్నదాతలు.. ఊర్జాదాతలు(Energy Givers)గా మారారని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. గత 11 సంవత్సరాలలో.. ఇథనాల్ వినియోగం, సరఫరా కారణంగా 2014-15 నుంచి 2025 జూలై 2025 వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.1,40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశాయని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: నవంబర్‌లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు


