లోక్‌సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో రహదారులపై అత్యాధునిక ఎలక్ట్రానిక్ టోల్ వసూలు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం అమల్లోకి ఉన్న వ్యవస్థ ఏడాదిలోగా ముగిసిపోనుందని తెలిపారు. మల్టీ–లేన్ ఫ్రీ ఫ్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థతో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆగకుండా ముందుకు దూసుకెళ్లొచ్చని వెల్లడించారు. ఇందులో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగి్నషన్ టెక్నాలజీ, కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత పరిజ్ఞానం ఉంటాయని వివరించారు.
ఆయన గురువారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నూతన టోల్ వసూలు వ్యవస్థ ఇప్పటికే పది చోట్ల అమల్లో ఉందని, ఏడాదిలోగా దేశమంతటా విస్తరింపజేయబోతున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్ రాకతో టోల్ ఫీజుల కోసం ఎవరూ ఆపబోరని, రోడ్లపై ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదని అన్నారు. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని, రుసుముల చెల్లింపుల్లో ఆలస్యాన్ని నివారించడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రూ.10 లక్షల కోట్ల విలువైన 4,500 రహదారుల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని నితిన్ గడ్కరీ వివరించారు.
హైడ్రోజన్ కారు వాడుతున్నా
దేశంలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. కాలుష్య నివారణలో భాగంగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే టయోటా ‘మిరాయ్’ వాహనాన్ని తాను ఉపయోగిస్తున్నానని తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడారు.
ఇది మెర్సిడెజ్ బెంజ్ కారు తరహాలోనే అంతే సౌలభ్యాన్ని ఇస్తోందని అన్నారు. మిరాయ్ అంటే జపాన్ భాషలో భవిష్యత్తు అని వెల్లడించారు. భవిష్యత్తు ఇంధనం హైడ్రోజన్ కాబోతోందని స్పష్టంచేశారు. శిలాజ ఇంధనాల దిగుమతి విలువ రూ.22 లక్షల కోట్లకు చేరిందని గడ్కరీ చెప్పారు. ఇలాంటి ఇంధనాలతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని, ఎన్నో దుష్పరిణామాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టక తప్పదని వివరించారు. ఆధునిక ఇంధనాల ఎగుమతి విషయంలో భారత్ అగ్రస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. జీవ ఇంధనాలను ఉపయోగించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్లు గడ్కరీ ప్రకటించారు.


