breaking news
electronic system
-
AP: ఈ–గవర్నెన్స్‌లోనూ అదుర్స్
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశవ్యాప్తంగా ఈ–గవర్నెన్స్ అమలులో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్–10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలతో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ 109.27 కోట్లతో రెండో స్థానంలోనూ.. 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అదే ఏపీలో 52.90కోట్ల ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యకమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. ఆరు కేటగిరీలుగా ఎలక్ట్రానిక్ సేవలు ఇక ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా నివేదిక వర్గీకరించింది. చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, బిజినెస్ సిటిజన్ సేవలు, సమాచార సేవలు, మొబైల్ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో చట్టబద్ధత, చట్టబద్ధతలేని సేవల లావాదేవీలు 4.16 కోట్లని నివేదిక పేర్కొంది. ఇక యుటిలిటీ బిల్లుల చెల్లింపుల లావాదేవీలు 10.76 కోట్లు.. సమాచార సేవల లావాదేవీలు 4.13 కోట్లు.. సామాజిక ప్రయోజనాల లావాదేవీలు 33.83 కోట్లు.. బిజినెస్ సిటిజన్ సేవల లావాదేవీలు 23 వేలు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానంలోనే ఏపీలో పాలన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్ కార్యదర్శులను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే కొనసాగుతోంది. ప్రజలకు అన్ని సేవలను ఎలక్ట్రానిక్ లావాదేవీల ద్వారానే ప్రభుత్వం నిర్వహిస్తోంది. నవరత్నాల్లోని పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా నివేదిక వర్గీకరించింది. దీంతో ఈ–గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించినట్లు నివేదిక వెల్లడించింది. -
ఈ-రిటర్నులతో ఎన్ని చిక్కులో..!
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పన్ను శాఖలో ‘ఎలక్ట్రానిక్ విధానం’ పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. సమాచార సమన్వయం లోపించిన కారణంగా సమస్యలు తలెత్తున్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా కోరుతున్న వివరాలు సంబంధిత వ్యక్తులకు చేరడం లేదన్న ఫిర్యాదులొస్తున్నాయి. రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులంతా ఈ-రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది ఈ-రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. వీటిని పరిశీలించిన ఆదాయం పన్ను శాఖ అనుమానాల నివృత్తి కోసం అదనపు వివరాలు కోరడం సర్వసాధారణం. అయితే, ఈ-రిటర్నులను ఆదాయం పన్ను శాఖ పరిశీలించేందుకు మూడు నుంచి ఐదేళ్ళు పడుతుండడం పన్ను చెల్లింపుదారులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ క్రమంలో తలెత్తే సందేహాలను తెలియజేయాలని చెల్లింపుదారులకు వారు సూచించిన ఈ-మెయిల్‌కు పుణ్యకాలం గడచిపోయాక సందేశం పంపుతున్నారు. వీటిపై సరిగా అవగాహన లేకపోవడమో, చూసీచూడనట్టు వదిలేయడం వల్లనో పన్ను చెల్లింపుదారులకు సమస్యలు వస్తున్నాయి. తాము కోరిన సమాచారం చప్పున ఇవ్వలేదు కాబట్టి, అదనంగా పన్ను చెల్లించాలని ఐటీ అధికారులు ఏకంగా నోటీసులు పంపుతున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు అధికారులను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. ఈ దశలో అదనపు పన్నుపై చెల్లింపుదారులు ట్రిబ్యునల్‌కు వెళ్ళడం తప్ప మరో గత్యంతరం ఉండటం లేదు. ట్రిబ్యునల్‌లో సమస్య పరిష్కారానికి ఏళ్ళ తరబడి వేచిచూడాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు ఇది తలనొప్పిగా మారుతోంది. ఇల్లు మారిన సందర్భాల్లో నోటీసులు కూడా అందడం లేదని వాపోతున్నారు. అదీగాక సుదీర్ఘకాలం తర్వాత బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఆదాయాన్ని అంచనా వేస్తున్నారని, వీటికి సమాధానం ఇవ్వడం సాధ్యం కావడం లేదని వారు అంటున్నారు.