కేంద్రం ‘సూత్రప్రాయ’ అంగీకారం
500 మిలియన్ యూఎస్‌డీ రుణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
లోక్‌సభలో ఎంపీ ఈటల ప్రశ్నకు కేంద్రం వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ నిధుల సేకరణలో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి 500 మిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ. 4,200 కోట్లు) రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికకు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖకు చెందిన ఎక్స్‌టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాల శాఖకు సిఫార్సు చేసినట్లు కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖన్ సాహూ వెల్లడించారు. గురువారం లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు .
అప్పు దొరకాలంటే డీపీఆర్ ఇవ్వాల్సిందే..: అయితే, ఈ రుణ ఒప్పందం ఖరారు కావడానికి కేంద్రం ఒక షరతు విధించింది. రుణ ఒప్పందంపై సంతకాలు చేసే ముందే.. నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్టార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ (సీపీహెచ్‌ఈఈఓ)కు సమర్పించి, వారి నుంచి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
అమృత్ 2.0 కింద రూ.3,849 కోట్లు..: కాగా అమృత్ 2.0 పథకం కింద జీహెచ్‌ఎంసీ పరిధిలో మురుగునీటి శుద్ధి కోసం రూ.3,849.10 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి పేర్కొన్నా రు. ఈ నిధులతో 972 ఎంఎల్‌టీల మురుగునీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, 4.92 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. మూసీ సుందరీకరణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోందని కేంద్రం తన సమాధానంలో పేర్కొంది.


