- పుంజుకుంటున్న ‘ఇండీ’కూటమి..?
2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచి రాష్ట్రాలపై బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ వస్తోంది. ఒడిశా లాంటి రాష్ట్రాలను సైతం కైవసం చేసుకున్న కాషాయదళం.. పశ్చిమ బెంగాల్ మాదే అంటోంది..! అయితే.. ఈశాన్యంలో వాస్తు దోషమో.. వ్యూహాత్మక తప్పిదాలో తెలియదు కానీ, నార్త్-ఈస్ట్ రాష్ట్రాల్లో విపక్షాలు బలం పుంజుకుంటున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో అసలు కాంగ్రెస్ ఉనికి అనేది లేకుండా బీజేపీ చేసింది. కానీ, ఇప్పుడు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసలు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ఎన్నికల కోసం ఇప్పుడే రాజకీయ వేడి రాజుకుందా? ఎవరిది పైచేయిగా ఉంది? ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? ఈ వివరాలు తెలియాలంటే.. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి.
ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం అత్యంత కీలకమైన రాష్ట్రం. 2016లో అనూహ్యంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని.. రెండో సారి కూడా విజయలక్ష్మి వరించింది. నిజానికి బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేయడం 2016లోనే మొదటిసారి. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తూనే.. బహుభార్యత్వ నిరోధక చట్టం.. అక్రమ చొరబాటు దారుల నిరోధం వంటి అంశాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం అమలు సమయంలో విద్యార్థి సంఘాల నిరసనను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే.. ఇప్పుడు మాత్రం జెన్-జీ ఉద్యమాలు బీజేపీని గద్దెదింపే స్థాయిలో ఉధృతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణంతో అభిమానుల ప్రవాహం ఉప్పొంగి కనిపించగా.. షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఆరు ఓబీసీ వర్గాలను చేర్చాలంటూ హిమంత సర్కారు చేసిన సిఫార్సు ఇప్పుడు ఎస్టీల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలకు కారణమవుతోంది. ఇప్పటికే శక్తిమంతమైన బోడో తెగలోని విద్యార్థి నాయకులు ఈ నిర్ణయాన్ని బహిరంగంగా ఖండించారు. అదే సమయంలో.. గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్.. ఈ అంశాలను ఎజెండాగా మలచుకుని, ప్రజావ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతోంది.
హిమంత సర్కారు ఎస్టీ జాబితా అనే తేనెతుట్టెను కదలించిందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు ఓబీసీలుగా ఉన్న థాయ్ అహోమ్, టీ తెగలు, కుచ్ రాజ్ బంశీ వంటి వర్గాలను ఎస్టీల్లో చేర్చాలని అస్సాం సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర జనాభాలో వీరి వాటా 27శాతం. ఈ నిర్ణయంపై అస్సాంలో రెండు నెలలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వర్గాలను ఎస్టీల్లో చేర్చడంతో తనకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ వర్గాలు గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్నాయి.
అదేసమయంలో ఈ జాబితాపై ఎస్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో ఎస్టీల జనాభా 13శాతం. వీరిలో బోడోలాండ్, కర్బీ అంగ్లాంగ్, దిమహాసావోలోని స్వయంప్రతిపత్తి ప్రాంతాల్లో ఉంటున్నారు. నిజానికి బీజేపీ అస్సాంలో పాగా వేయడానికి దోహదపడ్డ ప్రాంతాలు ఇవే. ఇప్పుడు ఈ తెగల వారు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో.. ప్రముఖ గాయకుడు జుబిన్ గర్గ్ మరణం కూడా హిమంత సర్కారును చిక్కుల్లో పడేసింది. ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు జుబిన్‌ది హత్యేనని ముఖ్యమంత్రి ప్రకటించాల్సి వచ్చింది. ఈ పరిణామాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే 8 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే.. బెంగాలీ మాట్లాడే ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐయూడీఎఫ్ ఈ కూటమికి దూరంగా ఉండాలని నిర్ణయించింది. అదే జరిగితే.. ఇండియా కూటమికి ఓట్ల చీలిక పోటు తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

అసోంతో పాటు.. ఈశాన్యంలో మరో కీలక రాష్ట్రం మణిపూర్. కుకీలు-మైటీలకు మధ్య వివాదాలతో జరిగిన అల్లర్లు మణిపూర్‌ను అట్టుడికించాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని తప్పించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో బీజేపీ అధిష్ఠానం రాజీనామా చేయించింది. ఫలితంగా రాష్ట్రపతి పాలన మొదలైంది. ఇప్పుడు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను స్వయానా బీజేపీ నాయకులే వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మరో ఆర్నెల్లపాటు రాష్ట్రపతి పాలనను పొడిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించాలంటూ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. 2027లో మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తాజా పరిణామాలు బీజేపీని చిక్కులోకి నెట్టేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక మేఘాలయ, త్రిపురలో కూడా రాజకీయ వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్‌కు చెందిన రోనీలింగ్డో నేషన్ పీపుల్స్ పార్టీలో చేరడంతో.. కాంగ్రెస్ పార్టీ మేఘాలయ అసెంబ్లీలో తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే..! అయితే.. మాజీమంత్రి ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. ఎన్‌పీపీ నేతృత్వంలో ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగుతోంది. 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీ(వీపీపీ)తో పొత్తుతో అధికారపీఠాన్ని చేజిక్కించుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. అదే జరిగితే.. ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. అటు త్రిపురలో రాజకుటుంబానికి చెందిన ప్రద్యోత్ మాణిక్య నేతృత్వంలోని టీఎంపీ బలాన్ని పుంజుకుంటోంది. అస్సాం, త్రిపురలో నిరసనలు.. మణిపూర్ అల్లర్లు, మేఘాలయలో పరిణామాలు మారుతున్న నేపథ్యంలో.. ఈశాన్యంలో బీజేపీకి చిక్కులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


