పుతిన్‌కు ఘన స్వాగతం | Russia President Putin Arrived To India | Sakshi
Sakshi News home page

పుతిన్‌కు ఘన స్వాగతం

Dec 4 2025 6:51 PM | Updated on Dec 5 2025 3:40 AM

Russia President Putin Arrived To India

ఎయిర్‌పోర్టుకు స్వయంగా వచ్చిన ప్రధాని మోదీ

ప్రధాని అధికారిక నివాసానికి ఒకే కారులో వెళ్లిన ఇరువురు నేతలు   

రష్యా అధినేతకు ప్రైవేట్‌ విందు

నేడు 23వ ఇండియా–రష్యా సదస్సుకు హాజరు కానున్న నేతలు

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌లో అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టారు. రష్యా నుంచి గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్, రష్యా మధ్య దశాబ్దాల స్నేహ సంబంధాలకు ప్రతీకగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత భారత పర్యటనకు వచి్చన పుతిన్‌ను చిన్నారులు సంప్రదాయనృత్యాలతో స్వాగతించారు. 

పుతిన్, మోదీ చప్పట్లతో వారిని అభినందించారు. అనంతరం ఇరువురూ ఒకే కారులో మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. అక్కడ పుతిన్‌కు ప్రధానమంత్రి ప్రైవేట్‌ విందు ఇచ్చారు. పుతిన్, మోదీ ఒకే కారులో ప్రయాణించడం మూడు నెలల్లో ఇది రెండోసారి. చైనాలోని తియాంజిన్‌ సిటీలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వారిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకున్న సంగతి తెలిసిందే.

 ప్రపంచంలో సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయాలు, వివిధ దేశాల మధ్య ఘర్షణలు, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌ చిరకాల మిత్రదేశమైన ఇండియాలో పర్యటిస్తుండడం విశేషమైన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి మరీ పుతిన్‌ కోసం ఎయిర్‌పోర్టుకు స్వయంగా రావడం విశేషం.

 తన మిత్రుడు పుతిన్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందంటూ ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆయనతో చర్చల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. భారత్‌–రష్యా బంధం ఇరుదేశాల ప్రజలకు ప్రయోజనం కలిగిస్తూ కాల పరీక్షకు నిలిచిందని ఉద్ఘాటించారు. మోదీ నివాసంలో విందు సమావేశం దాదాపు మూడు గంటలపాటు జరిగింది. అనంతరం పుతిన్‌ ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. రాత్రి ఆయన అక్కడే బస చేశారు.   

నేడు వరుస భేటీలు  
వరుస భేటీతో పుతిన్‌ షెడ్యూల్‌ శుక్రవారం బిజీబిజీగా సాగిపోనుంది. పుతిన్‌కు ఉదయం రాష్ట్రపతి భవన్‌ వద్ద భారత త్రివిధ దళాలు లాంఛనంగా స్వాగతం పలుకుతాయి. అనంతరం ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి, మహాత్మాగాం«దీకి నివాళులరి్పంచబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌ హౌస్‌లో జరిగే 23వ ఇండియా–రష్యా సదస్సులో పాల్గొంటారు. ఇదే భవనంలో పుతిన్‌కు, ఆయన ప్రతినిధి బృందానికి మోదీ విందు ఇవ్వబోతున్నారు. 

సదస్సు తర్వాత ఇద్దరు నేతలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయనున్నారు. అలాగే రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలోని న్యూ ఇండియా చానల్‌ను పుతిన్‌ ప్రారంభిస్తారు. భారత్‌ మండపంలో ఫిక్కి, రాస్‌కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యాపార సదస్సులో మోదీ, పుతిన్‌ పాల్గొంటారు. అనంతరం పుతిన్‌ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇచ్చే విందులో పాల్గొంటారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో పుతిన్‌ ఢిల్లీ నుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్తారు. 

కీలక ఒప్పందాలు?  
ఇండియా–రష్యా సదస్సులో ముఖ్యమైన అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు 
జరుగనున్నాయి.  

 

 

కారు పూలింగ్‌ ఆలోచన నాదే: పుతిన్‌   
చైనాలోని తియాంజిన్‌లో సెపె్టంబర్‌ 1న భారత ప్రధాని మోదీతో కలిసి ఒకే కారులో ప్రయాణించాలన్న ఆలోచన తనదేనని పుతిన్‌ తెలిపారు. ఇది తమ స్నేహానికి గుర్తు అని వివరించారు. ఇండియా టుడే వార్తా సంస్థకు ఇచి్చన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ముందస్తు ప్రణాళికతో జరిగిన ఘటన కాదని అన్నారు. సదస్సు వేదిక నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ తన కారు సిద్ధంగా ఉందని, కలిసి వెళ్దామని తాను కోరడంతో మోదీ అంగీకరించారని చెప్పారు. షాంఘై సహకార సదస్సు ఎజెండాతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుకున్నామని వెల్లడించారు.

 

పుతిన్‌కు భగవద్గీత బహూకరణ 
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్‌ భాషలోకి అనువదించిన భగవద్గీత ప్రతిని బహూకరించారు. భగవద్గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మోదీ గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement