ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి పార్లమెంట్ వేదికగా స్పష్టం చేశారు. ఈరోజు(గురువారం, డిసెంబర్ 4వ తేదీ) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఎక్సైజ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ మేడ రఘునాథ్‌రెడ్డి మాట్లాడుతూ..‘ ఏపీలో పొగాకు, పత్తి, వరి, మామిడి, అరటి రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పంట నష్టం వివరాలను కూడా నమోదు చేయడం లేదు. ఏపీ పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు.
వారి జీవనోపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. పొగాకు ఉత్పత్తి పెరగడంతో ధరలు పడిపోయి రైతులు కష్టాలు పడుతున్నారు. పొగాకు రైతులు కనీసం తమ పంట ఖర్చును కూడా తిరిగి రాబట్టుకోలేకపోతున్నారు. వేలాదిమంది రైతులకు ఇదొక పెద్ద సమస్యగా మారింది. రకరకాల కారణాలతో పొగాకును బోర్డు తిరస్కరిస్తుంది. పొగాకు బోర్డు తగిన చర్యల వల్ల రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.
ఏపీ రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలి. ఎక్సైజ్ డ్యూటీ వల్ల పొగాకు రైతులపై పడే ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి. పొగాకు ఉత్పత్తి , మార్కెట్ స్థిరీకరణ అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ఉపాధిని దెబ్బతీసేలా ఎక్సైజ్ పన్నులు ఉండొద్దు’ అని పేర్కొన్నారు.


