సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు బెయిల్ కండీషన్స్‌ను ఉల్లంఘిస్తున్నారని.. ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరిస్తున్నారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు.. తానే దొంగ, తానే పోలీసు. తనపై ఉన్న అవినీతి కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారు. ఇది బెయిల్ కండీషన్స్‌ను ఉల్లంఘించడం కదా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘‘చంద్రబాబు ఇవాళ బెయిల్ మీద ఉన్నారు. అమరావతిలో బాబు, ఆయన బినామీలు అవినీతికి పాల్పడ్డారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న తన అనుచరుడికి ఫైబర్‌నెట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. రూ.వందల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు గత పాలనలో కమీషన్లకు కక్కుర్తిపడి ఎస్ బ్యాంకులో రూ.1300 కోట్లు డిపాజిట్ చేశారు. మేం వచ్చాక రూ. 1300 కోట్లను వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకున్న కొన్ని రోజులకే ఎస్ బ్యాంక్ దివాలా తీసింది. 1300 కోట్లు వెనక్కి తీసుకోకపోతే పరిస్థితి ఏంటి?’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
‘‘స్కిల్ స్కామ్‌లో రూ.370 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారు. స్వయంగా బాబు సంతకాలు చేసిన పత్రాలు ఉన్నాయి. అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది. కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్‌లు చేస్తున్నారు. ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న కంపెనీకి ఫైబర్ నెట్ కట్టాబెట్టారు. వందల కోట్లు దోచిపెట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్‌పై బాబు సంతకం చేశారు. బాబు అండ్‌కో గోబెల్స్‌ను మించిపోయారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.


