సత్తుపల్లిటౌన్/చండ్రుగొండ: ఇంట్లో వారికి చెబితే ఏమంటారోనని వారు పడుకున్నాక కారు తీశారు ఆ విద్యార్థులు.. పక్క ఊరిలో ఒకరిని.. మరో ఊరిలో ఇద్దరిని కారు ఎక్కించుకున్నారు. తిరిగి తల్లిదండ్రులు లేచేలోపు ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో కారును వేగంగా నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టారు. అంతే ముగ్గురి ప్రాణాలు పోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఎవరికీ చెప్పకుండా బయట పడి అనంతలోకాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచారు. అప్పుడే ఎందుకు వెళ్లారో..? అంతగా ఏం పని ఉందో..? మమ్ములను ఇలా వదిలి వెళ్తారా..? అంటూ కుటుంబ సభ్యు లు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. బుధవారం తెల్లవారుజామున పెనుబల్లి వైపు నుంచి సత్తుపల్లికి కారులో ఐదుగురు విద్యార్థులు వస్తుండగా కిష్టారం అంబేడ్కర్‌నగర్ కాలనీవద్ద జాతీయ రహదా రి మధ్యలో ఉన్న డివైడర్‌ను కారు ఢీకొట్టగా ఈ ఘట న చోటు చేసుకుంది.
కొమ్మేపల్లికాలనీకి చెందిన సిద్దేశ్ జాయ్ (18) తన సమీప బంధువు మర్సకట్ల శశిధర్ (13) కలిసి మంగళవారం అర్ధరాత్రి తమ కారులో అన్నపురెడ్డిపల్లికివెళ్లి.. తలారి రాజా కుమారుడు అజయ్‌ను ఎక్కించుకుని, చండ్రుగొండ మండలం తిప్పనపల్లి జీపీ మహ్మద్‌నగర్‌కు వెళ్లి.. ఎస్కే ఇమ్రాన్, ఎస్కే సాజిద్ (21)ను ఎక్కించు కొని సత్తుపల్లికి బయలుదేరారు. దారిలో జరిగిన ప్రమాదంలో ఎస్డీ సాజిద్, మర్సకట్ల శశిధర్, జాయ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇమ్రాన్, తలారి అజయ్‌ల పరిస్థితి విషమంగా మారింది. ఘటనా స్థలాన్ని సత్తుపల్లి ఏసీపీ వసుంధరయాదవ్, సీఐ శ్రీహరి, ఎస్‌ఐ ప్రదీప్ సందర్శించారు. మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించిన సీఐ శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు..
శశిధర్, సిద్ధేశ్‌జాయ్, సాజిత్ మృతదేహాలను చూసేందుకు బంధువులు, విద్యార్థులు, స్నేహితులు, స్థానికులు చేరుకున్నారు. మృతదేహాలను చూసి బోరున విలపించారు. ఆదివారమే పుట్టినరోజు చేశామని, అప్పుడే నూరేళ్లు నిండాయా అని శశిధర్ తల్లిదండ్రులు ప్రేమలత, రాజబాబు రోదించిన తీరు కన్నీళ్లు తెప్పించింది. ఒక్కగానొక్క కుమారుడు సిద్ధేశ్ మృతితో శ్రీనివాసరావు, శ్రీలత.. సాజిత్ మరణంతో తల్లిదండ్రులు అజ్గర్, జిల్‌ఖాబీల రోదనలు మిన్నంటాయి. వారిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. శ్రీనివాసరావు వెలుగు సీసీగా పనిచేస్తుండగా.. అజ్గర్ వ్యవసాయం చేస్తున్నారు. సాజిత్ మృతితో చండ్రుగొండ మండలం మహ్మద్‌నగర్‌లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సందర్శించి నివాళులరి్పంచారు.


