రాష్ట్ర బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం కొనసాగించాలని, వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తేల్చిచెప్పారు. బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియ పారదర్శకంగా, సరళంగా జరిగేలా జాగ్రత్త వహించాలని సూచించారు. బెంగాల్ బీజేపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు.
ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు సమాచారం. బెంగాల్‌లో కచ్చితంగా అధికారం దక్కించుకోవాలని, అందుకోసం కష్టపడి పని చేయాలంటూ ప్రధానమంత్రి తమకు దిశానిర్దేశం చేశారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ చెప్పారు. బీజేపీ కార్యకర్తల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారని డార్జీలింగ్ ఎంపీ రాజు బిస్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కృషి చేయాలంటూ ఆదేశించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మాల్డాకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఖగేన్ ముర్ము కూడా మోదీని కలిశారు. అక్టోబర్‌లో ముర్ముపై అల్లరిమూక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ము ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి ఆరా తీశారు.


