200 ఇండిగో విమానాలు రద్దు  | Indigo cancels over 200 flights in single day due to crew shortage | Sakshi
Sakshi News home page

200 ఇండిగో విమానాలు రద్దు 

Dec 4 2025 4:25 AM | Updated on Dec 4 2025 4:25 AM

Indigo cancels over 200 flights in single day due to crew shortage

ఆలస్యంగా నడిచిన మరికొన్ని విమానాలు  

సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత తదితర కారణాలతో.. 

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు  

న్యూఢిల్లీ:  దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించడం, మరికొన్ని రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి సాంకేతిక సమస్యలు, రద్దీ, సిబ్బంది రోస్టరింగ్‌ నిబంధనలు, అననుకూల వాతావరణం వంటివీ విమానాల రద్దుకు కారణాలుగా నిలిచాయి.

 ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, గోవా, అహ్మదాబాద్, చెన్నై, హుబ్లీ, భోపాల్, భువనేశ్వర్‌ ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికుల గంటలకొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. వారు సోషల్‌ మీడియాలో తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ముఖ్యమైన సమావేశాలు వెళ్లలేకపోతున్నామని, ఇండిగో సిబ్బంది తగిన సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. ఇండిగో సంస్థ దేశంలో 2,200 విమానాలను నడిపిస్తోంది. మంగళవారం 1,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి. బుధవారం 200 విమానాలు రద్దయ్యాయి.

 ఈ పరిస్థితికి కారణం ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్‌(ఎఫ్‌డీటీఎల్‌) నిబంధనల్లో సవరణ చేయడమేనని ఇండిగో వర్గాలు చెబుతున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. పైలట్లకు, ఇతర సిబ్బందికి మరింత ఎక్కువ సమయం విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా పైలట్లు, సిబ్బంది కొరత ఏర్పడింది. దాంతో అనివార్యంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని, విమానాలు ఎయిర్‌పోర్టులకే పరిమితం అయ్యాయని అంటున్నారు. కొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సాంకేతిక లోపాలతో చెక్‌–ఇన్‌ వ్యవస్థలు సరిగా పనిచేయలేదు. కౌంటర్ల ముందు ప్రయాణికులు బారులు తీరారు.  

మరో 48 గంటలు ఇదే పరిస్థితి!  
రెండు రోజులుగా తమ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమేనని, వారిని క్షమాపణ కోరుతున్నామని ఇండిగో యాజమా న్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్‌లో మార్పులతోపాటు కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొంది. మరో 48 గంటలపాటు ఇబ్బందులు కొనసాగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎఫ్‌డీటీఎల్‌ కొత్త నిబంధనలను పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) ఇటీవలే జారీ చేశారు. విమాన సిబ్బంది రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, సంవత్సరానికి 1,000 గంటలకు మించి విధులు నిర్వర్తించకూడదని ఆదేశించారు. 24 గంటల్లో కనీసం 10 గంటలు వారికి విశ్రాంతి ఇవ్వాలని పేర్కొన్నారు. నవంబర్‌ 1వ తేదీ నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థల విమానాలు కూడా ఆలస్యంగా నడిచాయి.  

డీజీసీఏ దర్యాప్తు  
ఇండిగో ఫైట్ల రాకపోకల్లో అంతరాయంపై దర్యాప్తు చేస్తున్నట్లు డీజీసీఏ బుధవారం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటో తెలియజేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అలాగే విమాన సేవలను యథాతథంగా కొనసాగించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారోర చెప్పాలని సూచించినట్లు వివరించారు. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేశారు. మానవ వనరుల నిర్వహణలో ఇండిగో విఫలమైందని, అందుకే విమానాలను రద్దు చేయాల్సి వచ్చినట్లు ఎయిర్‌లైన్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(అల్పా) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement