తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సోలార్ ఫ్లేర్స్) వల్ల విమాన నియంత్రణ వ్యవస్థలోని కీలక డేటా పాడవ్వకుండా ఉండేందుకు ఎయిర్‌బస్ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాల సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారికంగా ప్రకటించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు చెందిన మొత్తం 323 ఏ320 ఫ్యామిలీ విమానాల్లో అవసరమైన అప్‌గ్రేడ్ పూర్తయింది. ఈ సత్వర చర్య ద్వారా విమానయాన భద్రతను నిర్ధారించడంలో భారత్ ముందడుగు వేసింది.
అప్‌గ్రేడ్ వివరాలు
ఇండిగో: మొత్తం 200 విమానాలూ 100 శాతం అప్‌గ్రేడ్ పూర్తి చేసింది.
ఎయిర్ ఇండియా: 113 విమానాల్లో 100 వాటిలో అప్‌గ్రేడ్ పూర్తయింది. 4 విమానాలు బేస్ మెయింటెనెన్స్‌లో ఉన్నాయి. 9 విమానాలకు మార్పు అవసరం లేదని ధ్రువీకరించారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: 25 విమానాల్లో 23 అప్‌గ్రేడ్ పూర్తి అయింది. మిగిలిన 2 విమానాలు లీజు ఒప్పందం ముగియడంతో తిరిగి వాటిని రిటర్న్ చేయనున్నారు.
సమస్య ఏమిటి?
ఎయిర్‌బస్ ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యంత తీవ్రమైన సోలార్ రేడియేషన్ (సౌర జ్వాలల సమయంలో) వల్ల Elevator and Aileron Computer (ELAC) అనే ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ పనితీరు తగ్గవచ్చు. దీనివల్ల ఎలివేటర్, ఐలెరాన్‌లకు వెళ్లే డేటాలో మార్పులుండవచ్చు. ఇది విమానం పిచ్ (పైకి/కిందకు), రోల్ (మలుపులు) నియంత్రణపై తాత్కాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సమస్య గుర్తించిన వెంటనే యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) అత్యవసర చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దానిని అనుసరించి శనివారం డీజీసీఏ కూడా భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తక్షణ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ ఆదేశం ఇచ్చింది.
ఇదీ చదవండి: యాప్స్.. మార్కెటింగ్ యంత్రాలా?


