భారత్‌లో చాలా మొబైల్ యాప్‌లు అవి అందిస్తున్న సర్వీసుల కంటే కూడా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా మార్కెటింగ్ యంత్రాలుగా మారాయనే వాదనలున్నాయి. ఇటీవల భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సందర్భంగా ఒక ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసిన వినియోగదారులు అందులోని యాడ్‌లు చూసి ఆశ్చర్యపోయారు. అందులో త్రివర్ణ పతాకంతో ఉన్న క్రికెట్ బ్యాట్ కింద బ్యానర్‌లో ‘ఈ మ్యాచ్ వీక్‌లో భారీ స్కోర్ చేయండి. బిర్యానీపై 20% తగ్గింపు!’ అని ఉంది. అసలు ఆ యాప్‌కు బిర్యానీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఇలా ప్రకటనలు వచ్చాయి.
గత దశాబ్దంలో భారతీయ యాప్స్ యుటిలిటీ టూల్స్ నుంచి పూర్తిస్థాయి మార్కెటింగ్ కాన్వాస్‌లుగా మారాయి. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఓలా, పేటీఎం, డంజో, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, బుక్‌మైషో, ఓయో.. ఇవి కేవలం సర్వీసులకు మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ బ్రాండ్ ఎకోసిస్టమ్‌లో భాగమయ్యాయి.
తమదైన శైలిలో లేబులింగ్..
ఒకప్పుడు యాప్ అంటే సెర్చ్ బార్, మెనూ, చెకౌట్ పేజీ.. ఉండేది. ఇప్పుడు యాప్‌లో ప్రతి విభాగం కమర్షియల్‌గా మారింది. హోమ్‌పేజీలో బ్యానర్లు, స్పాన్సర్డ్ రెస్టారెంట్ వివరాలు, సజెషన్స్, కిరాణా యాప్స్‌లో స్పాన్సర్డ్ ఉల్లిపాయలు, బిస్కెట్లు.. ఇలా ప్రతి లేబుల్‌లో యాడ్‌ల పర్వం కొనసాగుతోంది. అయితే ఇవి ప్రకటనలని తెలియకుండా కంపెనీలు చాలా జాగ్రత్త పడుతున్నాయి. నిబంధనల ప్రకారం ఇవి ప్రకటనలుగా లేబుల్ చేయాలి. అయితే అందుకు చాలా కంపెనీలు తమదైన శైలిలో లేబుల్‌ను చాలా చిన్నదిగా చేసి సాధారణ ఉత్పత్తుల్లో భాగంగానే చూపిస్తున్నాయి. దీనినే ‘నేటివ్ అడ్వర్టైజింగ్’ అని పిలుస్తున్నారు.
ఈ యాప్స్ కేవలం స్టాటిక్ బ్యానర్లను మాత్రమే ప్రమోట్ చేయడం లేదనే వాదనలున్నాయి. ఇవి వినియోగదారుల సందర్భాన్ని, భావోద్వేగాలను ఉపయోగించుకుంటున్నాయి.
స్విగ్గీ 2025 ఐపీఎల్ (IPL) సమయంలో ‘స్విగ్గీ సిక్సెస్’ ప్రవేశపెట్టింది. ప్రతి సిక్సర్‌కు డిస్కౌంట్ అందిస్తున్నట్లు చెప్పింది.
జెప్టో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ ప్రమోషన్ కోసం ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకుంది.
వాహనాలు ఆఫర్లను కంపెనీలు పండగలతో లింక్ చేస్తారు.
గూగుల్ పే స్క్రాచ్ కార్డులతో చెల్లింపులు పెంచుకుంటోంది.
ఇన్‌స్టామార్ట్ దీపావళి సమయంలో వర్చువల్ బాణసంచా ఆఫర్లు అందించింది.
ఇలా చాలా కంపెనీలు సందర్భోచితంగా, భావోద్వేగపూరిత యాడ్‌లను అందిస్తున్నాయి.
భారతీయులు రోజుకు సగటున 5-6 గంటలు మొబైల్‌తో గడుపుతున్నారు. అందులోనూ ఎక్కువ భాగం 8-10 యాప్స్‌నే వాడుతున్నారు. ఇది బ్రాండ్లకు అపార అవకాశం కల్పిస్తుంది. ఇందుకు కంపెనీలు విభిన్నం పంథాలను ఎంచుకుంటున్నాయి. కొన్ని సంస్థల యాప్స్ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు, మీరు బిర్యానీ ఆర్డర్ చేశారు కదా?’ అనే ప్రకటనలు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా యాప్స్‌లో ఆర్డర్ హిస్టరీ, చెల్లింపులు వంటి విస్తృతమైన డేటా ద్వారా వినియోగదారుల మనస్తత్వానికి అనుగుణంగా ప్రకటనలు అందిస్తున్నాయి. అయితే, ఇలాంటి పర్సనలైజేషన్ ప్రకటనల వెనుక డేటా ఎంతగా సేకరిస్తున్నారు, దాన్ని ఎలా వాడుతున్నారు.. అనేది పారదర్శకంగా లేదు.
కొన్నింటికి ప్రకటనలే దిక్కు..
2030 నాటికి భారతదేశంలో యాప్ అడ్వర్టైజింగ్ మార్కెట్ సుమారు 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. తక్కువ మార్జిన్లతో నడిచే డెలివరీ, రైడ్ హెయిలింగ్ కంపెనీలకు ఈ ఆదాయం ఆప్షనల్‌గా ఉండడంలేదు. అవి మనుగడ సాధించాలంటే తప్పకుండా ప్రకటనల ఆదాయం కావాల్సిందే. అయితే, చైనాలో వీచాట్ ఒకప్పుడు ప్రమోషనల్ ఇంటర్‌ఫేస్‌గా ఉండేది. యూజర్లు క్రమంగా తగ్గిపోతుండడంతో తిరిగి తన అసలు బిజినెస్‌పై దృష్టి సారించింది. బ్రాండింగ్ ప్రమోషన్‌లో తప్పేంలేదు. కానీ యాప్ ఇంటర్‌ఫేస్‌లో ప్రధానంగా బ్రాండ్లనే ప్రమోట్ చేస్తే అసలు సర్వీసులు మరుగునపడుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం


