268 విద్యాసంస్థల్లో అమలు చేసిన అధికారులు
ప్రతిరోజూ రెండు సెషన్లలో హాజరు స్వీకరణ
వచ్చే నెలాఖరుకల్లా అన్ని గురుకుల
సొసైటీల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని అన్ని విద్యాసంస్థల్లో ఫేస్ రికగ్నేషన్ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 268 ఎస్సీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఫేషియల్ రికగ్నేషన్ మొబైల్ యాప్ ఆధారంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. గురువారం నుంచి ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో హాజరు స్వీకరించారు.
విద్యార్థుల హాజరు మాత్రమే కాకుండా బోధకులు, సిబ్బంది హాజరు కూడా ఈ విధానంలోనే తీసుకుంటున్నారు. హాజ రు స్వీకరించిన వెంటనే సదరు విద్యాసంస్థ ప్రిన్సిపాల్ లాగిన్‌లో ఈ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఆ తర్వాత ఆయన ఆమోదంతో సెంట్రల్ సర్వర్‌లో అప్‌లోడ్ అవుతాయి. ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే అన్ని కార్యక్రమాల అమలు చేపట్టనున్నట్టు ఎస్సీ గురుకుల సొసైటీ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు, లోటుపాట్లను సరిదిద్దేందుకు సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వారం పాటు పరిశీలన
తొలివారం రోజుల పాటు హాజరు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మార్పులు చేసే అవకాశముంది. ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుకు సంబంధించిన పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్‌దే. దీనికి సంబంధించి రాష్ట్రస్థాయి అధికారులు, మల్టిజోనల్ ఆఫీసర్లు, జోనల్ ఆఫీసర్లు, జిల్లా కోఆర్డినేటర్లకు కూడా సొసైటీ కార్యాలయం పలు సూచనలు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా హాజరు ఆధారంగానే గురుకుల నిర్వహణకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది. ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల సొసైటీల్లో కూడా ఒకేసారి ఈ ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.


